బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే నామినీగా తీసుకుంటున్నారు. నలుగురు నామీనీలను తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందింది. వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, లాకర్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఖాతాదారుల కంటే నామినీలు కొందరు ముందుగా చనిపోవడం వల్ల దేశంలో వివిధ బ్యాంకుల వద్ద 4 లక్షల కోట్లు పోగుబడ్డాయి. వాటిని తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు అనేక కేసులు ఎదుర్కొంటున్నాయి. నలుగురు నామినీలు ఉంటే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు.
ఉద్దేశ పూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ హెచ్చరించారు. బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు తగ్గాయన్నారు. రైట్ ఆఫ్ అంటే బ్యాంకు రుణాలు రద్దు చేయడం కాదని గుర్తు చేశారు. బ్యాంకులు మొండి బాకీలు వసూలు చేసే క్రమంలో రైట్ ఆఫ్ ఒక ప్రక్రియ మాత్రమే అన్నారు. దేశ వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగివేసిన 912 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
దేశ వ్యాప్తంగా బుధవారం నాడు యూపీఐ చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్నీ డిజిటల్ లావాదేవీలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఎన్‌పీసీఐ ప్రకటించింది.