హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతదేహం రాజమండ్రి శివారు కొంతమూరు దగ్గర మంగళవారం ఉదయం లభించింది. అయితే ప్రవీణ్ కుమార్‌ది హత్యే తప్ప ఆయన మృతికి రహదారి ప్రమాదం కారణం కాదంటూ పాస్టర్లు ఆందోళన మొదలుపెట్టారు. కొన్నాళ్ళ క్రితం షఫీ అనే ముస్లిం మతపెద్దతో పగడాల ప్రవీణ్ కుమార్‌కు గొడవ జరిగింది. ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియా పోస్టుల్లో షఫీకి, ముస్లిం సమాజానికీ క్షమాపణలు చెప్పారు. తనను చంపవద్దంటూ బ్రతిమాలారు. అయినా, ఇప్పుడు జరిగినది హత్యేనంటూ ఆరోపిస్తున్న వారు ఆ హత్య హిందువులు చేయించి ఉంటారంటూ కథలు అల్లుతున్నారు.
పాస్టర్ మృతి మీద క్రైస్తవ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. పాస్టర్ మృతిని కేవలం ప్రమాదంగా భావించడం లేదని హోంమంత్రి అనిత అన్నారు. డీఎస్‌పీ స్థాయి అధికారుల కమిటీ విచారణ చేస్తోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేసారు.
ఆ నేపథ్యంలో ఈ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
‘‘రోడ్డు పక్కన శవం పడి ఉందని మంగళవారం ఉదయం సమాచారం అందింది. శవం పక్కనే పడివున్న సెల్‌ఫోన్‌లోని లాస్ట్‌కాలర్‌కు ఫోన్ చేసి, మృతుణ్ణి గుర్తించాము. హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. మంగళవారం సాయంత్రం మృతుడి బావమరిది వచ్చి పాస్టర్ మరణం అనుమానాస్పద మృతి అని ఫిర్యాదు చేసారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో కొన్ని ఆధారాలు సేకరించాము. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరుగుతోంది’’.
‘‘వైద్యబృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. ఆ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్ చేయించాం. కొవ్వూరు టోల్‌గేట్ దగ్గర, కొంతమూరు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. సోమవారం రాత్రి 11.43కు రహదారి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. టూవీలర్ మీద వెడుతున్న పాస్టర్‌ను ఒక కారు ఢీకొని ఉంటుందని భావిస్తున్నాం. ఆ కారును గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాం. పోస్ట్‌మార్టమ్ తర్వాత శవాన్ని హైదరాబాద్ పంపించాం’’ అని ఎస్పీ వివరించారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ టీవీచానెళ్ళలో డిబేట్లలో పాల్గొనేటప్పడు యధావిధిగా హిందువులను దూషించడం, హిందువుల చరిత్రను వక్రీకరించి చెప్పడం వంటి పనులు చేసేవాడు. వాటిని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసేవాడు. అయితే అతన్ని హిందువులు పెద్దగా హెచ్చరించిన దాఖలాలు ఏమీ లేవు. ప్రవీణ్ సైతం హిందువుల ఆవేశ ప్రకటనలకు భయపడినట్లు, నన్ను చంపవద్దు అంటూ బతిమాలుకున్నట్లూ పెద్దగా ఎక్కడా కనబడదు.
హిందువులను తిట్టినట్లే ముస్లిములనూ తిట్టి, వారిని తన మతంలోకి లాక్కుపోవాలని ప్రవీణ్ భావించినట్లున్నాడు. హిందువులను తక్కువ చేసి మాట్లాడిన విధంగానే ముస్లిముల గురించి కూడా పలు సందర్భాల్లో మాట్లాడాడు. దాంతో ముస్లిములు అతన్ని తీవ్రంగా దూషించారు. పాస్టర్‌కు ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలీదు, ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అతను ముస్లిం మతానికి చెందిన షఫీ అనే వ్యక్తిని క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టాడు. అలాగే, ముస్లిములను (వ్యంగ్యంగానో, మరి నిజంగానో) క్షమాపణలు కోరుతున్నట్లు వీడియో చేసి యూట్యూబ్‌లో షేర్ చేసాడు. మొత్తం మీద ముస్లిములతో అతనికి వైరుధ్యాలూ, ఘర్షణలూ ఉన్నట్లు దాన్నిబట్టి అర్ధమవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ ప్రచారం కోసం పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. సోమవారం రాత్రి రాజమండ్రి దగ్గరకు చేరుకున్నాడు. కొంతమూరు దగ్గర ప్రమాదకరమైన ప్రదేశంలో అతని వాహనం ప్రమాదానికి గురయింది. చాగల్లులో కార్యక్రమానికి వెళ్ళవలసిన వ్యక్తికి రాజమండ్రి దగ్గర పని ఏముంటుంది? ప్రవీణ్ ఎందుకు గోదావరి దాటి మరీ రాజమండ్రి వెళ్ళాడు? అన్న సందేహాలు ఎవరూ అడిగినట్లు లేదు.
అయితే నిజానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదం వల్ల మరణించలేదు, హత్య చేయబడ్డాడు అని క్రైస్తవ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ హత్య హిందువులే చేసి ఉంటారు అంటూ ఒక ప్రచారం మొదలైపోయింది. అసలు పోస్ట్‌మార్టం జరగక ముందే అది హత్య అనీ, ఆ హత్య చేసింది హిందువులే అనీ అంటూ విషప్రచారం ప్రారంభించేసారు. సామాజిక మాధ్యమాల్లో కథలు వ్యాపింపజేస్తున్నారు. ఇంకా విచిత్రంగా… షఫీతో గొడవ గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆ వంకను అడ్డు పెట్టుకుని మరీ హిందువులే చంపించేసారంటూ పుకార్లు వ్యాపింపజేస్తున్నారు.
నిజానిజాలు తెలియకముందే హిందువులపై దుష్ప్రచారం చేసి, పాస్టర్ ప్రవీణ్ పగడాల హిందువుల చేతిలో హత్యకు గురయ్యాడు అనేలాంటి కథనాలను వ్యాపింపజేస్తున్నారు. ప్రజలు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు కథనాలను నమ్మి మత ఘర్షణలను రెచ్చగొట్టేవారి ఆటలకు లొంగిపోకూడదు. విజ్ఞతతో వ్యవహరించాలి. పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం ఉంచాలి. అటు పోలీసులు సైతం ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగిపోకుండా దర్యాప్తును సక్రమంగా జరిపించాలి. దర్యాప్తు ఫలితాలను నిష్పక్షపాతంగా ప్రకటించాలి తప్ప ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.