విజయవాడకు చెందిన శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శ్రీరామ శోభాయాత్ర జరుగుతుందని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ తెలిపారు.
బుధవారం సత్యనారాయణపురంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని దాసాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏప్రిల్ 6న నిర్వహించే శ్రీరామ శోభాయాత్ర పోస్టర్‌ను శివస్వామి ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శోభాయాత్రకు హిందూ బంధువులు, యువకులు వేలాదిగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఆ శోభాయాత్ర ర్యాలీ సత్యనారాయణపురం ఆదిశంకర సర్కిల్ వద్ద నుంచి బిఆర్‌టిఎస్ రోడ్డు మీదుగా కొనసాగుతుందని శివస్వామి చెప్పారు. హిందువులు వేలాదిగా కదలి వచ్చి శోభాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీరామ శోభాయాత్ర సమితి కన్వీనర్ నాగలింగం శివాజీ కోరారు.
ఆ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లోకనాథ శర్మ, కె శ్రీనివాస్, బొడ్డు నాగలక్ష్మి, సిహెచ్ సూర్యతేజ, అవుటుపల్లి శివప్రసాద్, బాచిమంచి రవి, బాల తదితరులు పాల్గొన్నారు.