2023లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో దోషిగా నిరూపణ అయిన పూజారి వెంకట సాయికృష్ణకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసిన నేరానికి మరో ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది.
సరూర్‌నగర్‌కు చెందిన అప్సర తనను పెళ్ళి చేసుకోవాలని అడగడంతో పూజారి వెంకట సాయికృష్ణ ఆమెను హత్య చేసాడు. శంషాబాద్‌కు కారులో తీసుకుని వెళ్ళి హతమార్చాడు. తర్వాత తన ఇంటి దగ్గర ఒక డ్రైనేజీలో ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మ్యాన్‌హోల్‌ను మట్టితో కప్పెట్టాడు. తర్వాత సిమెంట్‌తో మూసేసాడు. కేసు దర్యాప్తు చేసిన సరూర్ నగర్ పోలీసులు సాయికృష్ణే హంతకుడని సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. కేసును విచారించిన న్యాయస్థానం సాయికృష్ణను దోషిగా నిర్ధారించింది.
అప్సర నటి అవుదామనే ఉద్దేశంతో 2022లో తమిళనాడు నుంచి హైదరాబాద్ వచ్చింది. సరూర్ నగర్‌లో తల్లితో పాటు ఉండేది. సమీపంలోని గుడిలో పూజారి అయిన వెంకట సాయికృష్ణతో అనుబంధం ఏర్పడింది. అప్పటికే సాయికృష్ణ వివాహితుడే కాక తండ్రి కూడా. అయినా అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఆ విషయమై అతన్ని ఒత్తిడి చేయసాగింది. మోజు తీరిపోయిన కొన్నాళ్ళకు సాయికృష్ణ అప్సరను వదిలించుకోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే హత్య చేసాడు.
2023 జూన్ 3న కోెయంబత్తూరు వెడదామని సాయికృష్ణ అప్సరకు చెప్పాడు. విమానం టికెట్లు కొనుగోలు చేసాని కూడా చెప్పి నమ్మించాడు. అదే సమయంలో ఆమె సొంత పని మీద కోయంబత్తూరు వెడుతోందని, ఆమెను విమానం ఎక్కించి వస్తానని అప్సర తల్లికి చెప్పాడు. సరూర్‌నగర్ నుంచి శంషాబాద్ వరకూ కారులో తీసుకెళ్ళాడు. దారిలో ఒక హోటల్లో భోజనం చేసారు. రాత్రి 11 గంటల సమయంలో సుల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్ళారు. అక్కడ కాసేపు గడిపారు. అక్కడే అప్సరకు తెలియకుండా ఒక రాయిని సేకరించాడు.
జూన్ 4 తెల్లవారుజామున నర్కుడలోని ఒక ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. అప్సర నిద్రలో ఉందని నిర్ధారించుకున్నాక కారు సీటు కవర్‌తో ముఖం మీద అదిమి ఊపిరాడకుండా చేసాడు. తర్వాత రాయితో తల మీద బలంగా పదేపదే మోదాడు. ఆమె చనిపోయేవరకూ కొట్టాడు. అప్సర శవాన్ని రెండురోజులు కారులోనే దాచిపెట్టాడు. తర్వాత సరూర్ నగర్ మైసమ్మ గుడి దగ్గర మ్యాన్‌హోల్‌లో పడేసాడు. మ్యాన్‌హోల్ దుర్వాసన వస్తోందంటూ అడ్డాకూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టితో మ్యాన్‌హోల్ మూయించేసాడు, తర్వాత సిమెంటుతో పూడ్పించేసాడు.