తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ కె తారక రామారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తించాయి. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ శాసనసభలో వ్యాఖ్యానించారు. దానిపై అధికార పక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సహా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ ప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆందోళనలతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేసారు. లేని పక్షంలో సభకు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసారు. అసెంబ్లీ ఎంట్రన్స్ దగ్గర ఆందోళన చేపట్టారు. థర్టీ పర్సెంట్ ప్రభుత్వం అంటూ నినాదాలు చేసారు.