ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆరు జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ తీసుకున్న సీఎం.. జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పర్యాటక రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. తాను 30 ఏళ్లుగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకోని కమ్యూనిస్టులు సైతం ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని చంద్రబాబు అన్నారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కాస్మోపాలిటిన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలన్నారు. అనకాపల్లి, అరకు ప్రాంతాల్లోనూ అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు.
తలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. విశాఖ తర్వాత అనకాపల్లి, అల్లూరి జిల్లాలు నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనకబడిందని గమనించిన ముఖ్యమంత్రి, ఆ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు.
వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. లక్ష మంది పారిశ్రామిక వేత్తలు, వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విశాఖపట్నంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను వచ్చే నెలలోనే ప్రారంభిస్తామన్నారు. అల్లూరి జిల్లాలో లక్ష మంది గిరిజనులు, 35 వేల మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేని విషయాన్ని గుర్తించిన సీఎం, వారికి వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.