ఆంధప్రదేశ్ కలెక్టర్ల సమావేశం రెండవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచనను పంచుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శాటిలైట్‌కు అనుబంధంగా డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఐఓటీ పరికరాలూ ఉంటాయని… వాటిని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో అనుసంధానం చేయవచ్చనీ చెప్పారు. అలా జరిగితే సమాచార సేకరణతో పాటు రియల్ టైమ్‌లో ప్రజలకు సేవలు అందించవచ్చన్నారు.
కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాట్సాప్ పరిపాలన, రియల్ టైం గవర్నెన్స్, వర్క్ ఫ్రం హోం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. శాటిలైట్ ద్వారా అక్రమాలను కనుగొనడం సులువు అవుతుందని సీఎం వివరించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అందరి పనితీరునూ అంచనా వేస్తామని చెప్పారు. కోర్టు కేసులు, వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.