యూపీఐ డిజిటల్ లావాదేవీలు పెరిగాక ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడం కొంతవరకూ తగ్గింది. అయినా, ఇప్పటికీ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకోవడం అవసరమే. అయితే సొంత బ్యాంకు ఏటీఎంలో కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాలి. వచ్చే మే 1 నుంచీ ఆ రుసుమును పెంచుకోడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి తన ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుంచి కాక వేరే బ్యాంకు ఏటీఎంల నుంచి కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే దానికి పరిమితులున్నాయి. మెట్రో నగరాల్లో అయితే ఐదు సార్లు, మిగతా చోట్ల అయితే మూడు సార్లు మాత్రమే కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా వాడుకోవచ్చు. అంతకు మించితే దానికి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ అంటారు. ఇప్పుడు బ్యాంకులకు ఆ ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ పెంచుకొనే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ కల్పించింది.
ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ విలువ ఒక్కో బ్యాంక్‌లో ఒక్కోలా ఉంది. నిజానికి బ్యాంకులే కాకుండా కొన్ని కంపెనీలు కూడా ఏటీఎంలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ తమకు గిట్టుబాటు కావడం లేదని అలాంటి ‘వైట్ లేబుల్ ఆపరేటర్స్’ రిజర్వ్ బ్యాంక్‌ను అర్ధించాయి. దాంతో ఆ ఛార్జీలను పెంచుకోడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతులిచ్చింది. మే 1నుంచీ అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలపై మరికొంత స్పష్టత రావాలి. ఆ భారాన్ని బ్యాంకులు తామే భరిస్తాయా లేక వినియోగదారుల మీదకు నెట్టేస్తాయా అన్నది ఆ బ్యాంకులు నిర్ణయం తీసుకోవాలి.
ఎంతెంత భారం:
— ఇతర బ్యాంకు ఏటీఎంలో నుంచి మూడుసార్లు, మెట్రో నగరాల్లో అయితే ఐదుసార్లు ఉచితంగా డ్రా చేసుకోవచ్చు.
— ఆ పరిమితిని దాటితే ఒకో లావాదేవీకి రూ.17 ఛార్జీలు పడతాయి. దానికి ఇప్పుడు అదనంగా మరో రూ.2 పడవచ్చు.
— బ్యాలెన్స్ ఎంక్వైరీకి అయితే ఇప్పటివరకూ రూ.6 తీసుకుంటున్నారు. ఇప్పుడు అది ఒక రూపాయి పెరిగి రూ.7 అయ్యే అవకాశముంది.
— అదనపు లావాదేవీలకు వసూలు చేస్తున్న రుసుములను పెంచుకోడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది. అయితే వినియోగదారుల మీద ఈ అదనపు భారం మోపాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవలసింది బ్యాంకులే. 90శాతం బ్యాంకులు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటాయి. అంటే కస్టమర్లకు అదనపు చార్జీలు పడతాయన్నమాటే.
— ఈ కొత్త ఛార్జీలు 2025 మే 1 నుంచీ అమల్లోకి వస్తాయి.
— ఏటీఎం కార్డుల వాడకం గతంతో పోలిస్తే పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా తగ్గింది. ఆన్‌లైన్ వ్యాలెట్లు, యూపీఐ ట్రాన్సాక్షన్ల వంటి డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్ 2013-14లో రూ.952 లక్షల కోట్లు ఉంటే, 2022-23 నాటికి రూ.3,658 లక్షల కోట్లకు పెరిగింది.
— ఏటీఎం కార్డులపై వాడకం ఛార్జీలు మరింత పెంచుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది.