వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజినిపై అవినీతి కేసు
వైసీపీ ముఖ్యనేతలు పలువురు కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్ కమిటీ నేతల నుంచి జిల్లా స్థాయి ముఖ్యనేతల వరకు ఎదో ఒక కేసుతో సతమతం అవుతూనే ఉన్నారు. వైసీపీ పాలనలో వీరంతా అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. కూటమి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని చెబుతున్నప్పటికీ తాము ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టలేదని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.
కేసుల భయంతో కొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్పగా మరికొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో పార్టీ పై అభిమానంతో ఇంకొందరేమో వేరే ఎంపిక లేకపోవడంతో అదే పార్టీలో ఉండి నానా యాతన పడుతున్నారు.
తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీ, మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదైంది. నర్సరావుపేట లోక్ సభ పరిధిలోని ఈ నియోజకవర్గం గత వైసీపీ పాలనలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అప్పటి, ఇప్పటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పుడు మంత్రి హోదాలో ఉన్న విడదల రజిని మధ్య రాజకీయ వైరంపై మీడియాలో బ్రేక్ లేకుండా కథనాలు వచ్చేవి.
2024 ఎన్నికల వేళ లావు శ్రీకృష్ణదేవరాయులు వైసీపీని వీడి టీడీపీలో చేరి విజయం సాధించారు. విడదల రజిని, చిలకలూరి పేటకు బదులు గుంటూరు పశ్చిమ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడారు. ఫ్యాన్ గుర్తు పై చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన మనోహర్ నాయుడు వైసీపీ ని తాజాగా వీడారు. దీంతో చిలకలూరిపేట బాధ్యతలు, విడదల రజినికి వైసీపీ అధిష్టానం అప్పగించింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజిని మంత్రి హోదాలో తమను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని తాజాగా కేసు నమోదైంది. రాజకీయ కక్షతోనే స్టోన్ క్రషర్ మిల్లుపై విడదల రజిని దాడులు చేయించారని నాటి ఆర్వీఈవో, ఐపీఎస్ జాషువా వాంగ్మూలం ఇచ్చారు. అలాగే మరికొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం మాటున రజినితో పాటు ఆమె మరిది, ఆమె పీఏ చేసిన అరాచకాలను బాధితులు మీడియా ముందు చెప్పి వాపోయారు.
వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీ , ఉద్యోగుల బదిలీలు, ఇతర వ్యవహారాలను కూడా నాన్‌లోకల్ ప్రాతిపదికన మంత్రి రజిని వ్యక్తిగత కార్యదర్శులు చూసుకునేవారనే ఆరోపణలు అప్పట్లో వెల్తువెత్తాయి. నియోజకవర్గ పరిధిలో బదిలీలు, ఇతర భూ వివాదాలు, సెటిల్మెంట్లు మంత్రి సమీప బంధువు చూసేవారని స్థానికంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
జగనన్న కాలనీలకు ఇళ్ళ స్థలాల సేకరణ పేరుతో దాదాపు రూ.10 కోట్లు చేతులు మారినట్లు అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఎకరం రూ.10 లక్షలు కూడా చేయని పనికిరాని భూములను రూ.30 లక్షలకుపైగా వెచ్చించి ప్రభుత్వంతో కొనుగోలు చేయించడంలో ఆమె పాత్ర ఉందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. పసుమర్రు పంచాయతీ శివారులో గుడేవారిపాలెంలో పనికిరాని భూముల సేకరణలో రూ.10 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. కొందరు రైతులతో ఒప్పందాలు చేసుకుని ఖాళీ నోట్లు, చెక్కులు కూడా తీసుకుని ప్రభుత్వం నుంచి అధిక రేటుకు పొలం కొనేలా ఆమె వ్యవహరించారంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు కూడా మీడియా సమావేశంలో లేవనెత్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె, రైతులకు డబ్బులు తిరిగి చెల్లించారన్నారు.
ఎస్సీ, బీసీలకు చెందిన యడవల్లి భూములను నామమాత్రపు ధరకే ప్రభుత్వానికి అప్పగించారని తర్వాత వీటిని ఏపీఎండీసీకి అప్పగించి బహిరంగ వేలానికి ఆన్లైన్లో టెండర్లు పిలిచినట్లు వివరించారు.
యడవల్లి భూముల మొత్తం 192 ఎకరాలు కాగా, ఇందులో 160 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సొసైటీగా ఏర్పడి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు.
అధికారంలోకి వస్తే పట్టాలిచ్చి న్యాయం చేస్తామని అప్పట్లో వైసీపీ హామీ ఇచ్చింది. కానీ అలా చేయలేదు. ఆ భూముల్లో విలువైన గ్రానైట్ ఉందని తేలడంతో రజిని అండదండలతో జగన్ బంధువులు ప్రతాపరెడ్డి, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి రంగంలోకి దిగారని ఎకరానికి రూ.8 లక్షల చొప్పున ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించారనే విమర్శలు ఉన్నాయి. పలువురు బాధితులు ఈ విషయాన్ని గ్రీవెన్స్ లో ప్రస్తావించారు.