గత వైఎస్ఆర్సిపి హయాంలో పోలీస్ విభాగంలో విచిత్రమైన అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుత ప్రభుత్వం కనుగొంది. పోలీసు జాగిలాలకు నాసిరకం తిండి పెట్టి, ఆ మేరకు నిధులు దుర్వినియోగం చేసారని అభియోగాలు నమోదు చేసింది. కుక్కపిల్లల కొనుగోళ్ళలోనూ నిబంధనలను ఉల్లంఘించిన సంగతి బైటపడింది. ఆ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన అధికారుల మీద క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్ర హోంశాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి జి విజయ్‌కుమార్ నిన్న ఆదేశాలు జారీ చేసారు.
టి. శ్రీనివాసరావు అనే అధికారి 2012 ఫిబ్రవరి నుంచి 2023 మే వరకూ రాష్ట్రంలోని ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లో డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. శిక్షణకు అనువైన డాగ్స్ ఎంపిక, కొనుగోలు బాధ్యతలు కూడా ఆయనే చూసేవారు. ఆ సమయంలో ఆయన 35 కుక్కపిల్లల కొనుగోలులో నిబంధనలు పాటించలేదని వెల్లడైంది.
పోలీసు జాగిలాలకు ఆహారంగా పెట్టే పెడిగ్రీ కొనుగోళ్ళలో సైతం శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని తేలింది. నిర్దేశిత ప్రమాణాలు లేని, నాసిరకమైన పెడిగ్రీని కొని పోలీస్ డాగ్స్‌కు పెట్టేవారు. వాటిలో ఎనిమిది రకాల పదార్ధాలు నిర్దేశిత ప్రమాణాల కంటె చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. దానివల్ల, శిక్షణ పొందుతున్న శునకాల ఆరోగ్యం దెబ్బతిందని సమాచారం.
శిక్షణలో నుంచి ఆరు కుక్కపిల్లలను తీసివేసి వాటి స్థానంలో కొత్త కుక్కలను పెట్టారు. నిజానికి దానికోసం నిర్దేశిత విధివిధానాలను అనుసరించాలి. డాగ్ హ్యాండ్లర్ల నుంచి విజ్ఞప్తి లేఖ ఉండాలి. శిక్షకుల అభిప్రాయం తీసుకోవాలి. పశువైద్యుల సర్టిఫికేషన్ ఉండాలి. అన్నిటికీ పైన ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. అవేవీ పాటించకుండా త్త కుక్కపిల్లలను తీసుకొచ్చారు. ఆ కొత్త శునకాలకు వ్యాక్సినేషన్, ఆహారం వంటి ఖర్చులకు అదనపు బడ్జెట్ ఖర్చు చేయవలసి వచ్చింది. ట్రయినింగ్లోనూ ఆలస్యం జరిగింది.
ఈ వ్యవహారం మొత్తం 2021 జనవరి నుంచి 2023 ఏప్రిల్ వ్యవధిలో జరిగిందని ఉన్నతాధికారులు కనుగొన్నారు. శ్రీనివాసరావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పిగా పనిచేసి, అనంతర కాలంలో రిటైర్ అయిన కె సూర్యభాస్కర్ రెడ్డి మీద కూడా ప్రభుత్వం అభియోగాలు మోపింది.
పోలీసు కుక్కల ఎంపిక, కొనుగోలు, వాటి ఆహారంలో అక్రమాలు మాత్రమే కాదు, పోలీసు వాహనాలకు అవసరమైన ఆయిల్ విషయంలోనూ నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలింది. 2022 మే నుంచి 2023 ఏప్రిల్ అంటే యేడాది వ్యవధిలో 8 వాహనాలకు 4093 లీటర్ల పెట్రోలు ఉపయోగించినట్లు రికార్డుల్లో చూపించారు. ఆ మేరకు నిధులను డ్రా చేసారు. నిజానికి ఆ కాలవ్యవధిలో ఆ వాహనాలను అసలు ఉపయోగించనే లేదని తేలింది. ఈ విషయంలో అప్పట్లో ఐఎస్‌డబ్ల్యూ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో డీఎస్పీగా పనిచేసి, ప్రస్తుతం పీటీఓ డీఎస్పీగా పనిచేస్తున్న డి కోటేశ్వరరావును బాధ్యుడిగా గుర్తించారు. ఆయనకు తోడు ప్రస్తుతం ఆర్ఎస్ఐలుగా వేర్వేరు చోట్ల పనిచేస్తున్న ఎం సతీష్ కుమార్, ఎం కృష్ణలను కూడా బాధ్యులుగా గుర్తించి, ప్రభుత్వం వారిపై అభియోగాలు మోపింది.
ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు అప్పట్లో ఎస్పిగా పనిచేసి, అనంతర కాలంలో రిటైర్ అయిన కె సూర్యభాస్కర రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లనే ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇద్దరు ఎస్పిఎఫ్ కానిస్టేబుళ్ళ నియామకంలోనూ ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది.