ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో పరుగుల మోత మోగింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, 42 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య దూకుడుగా ఆడి 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (16), మార్కస్ స్టొయినిస్( 20) పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ మూడు వికెట్లు తీయగా, రబాడా , రషీద్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.
భారీ లక్ష్యఛేదనలో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ను దూకుడుగానే ప్రారంభించింది. కెప్టెన్ శుభమన్ గిల్ 14 బంతుల్లో 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి బట్లర్ వచ్చాడు. సాయి సదుర్శన్ 41 బంతులు ఎదుర్కొని 74 పరుగులు చేశాడు. కండరాలు పట్టేసినా పంటిబిగువున షాట్లు బాదాడు. ఆఖరకు క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రూథర్ ఫర్డ్ భారీ సిక్స్ బాది స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. జాస్ బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు చేసి యన్ సన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 199 పరుగులు వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఆఖరి ఓవర్ మొదటి బాల్ ను ఆడిన తెవాటియా రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ ఆశలు ఆవిరి చేశాడు. రెండు బంతులు ఎదుర్కొని ఆరుపరుగులుచేసి వెనుదిరిగాడు. రూథర్ ఫర్డ్ 28 బంతుల్లో 46పరుగులు చేసి వెనుదిరిగాడు. గుజరాత్ ఐదు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా, యన్ సన్, మ్యాక్స్ వెల్ చెరొక వికెట్ తీశారు.
మ్యాచ్ 6 లో భాగంగా బుధవారం నాడు గువహటి వేదికగా రాజస్తాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.