ఈ యేడాది విజయదశమికి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఆ సందర్భంలో దేశప్రజలు అందరికీ చేరువ అవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకూ శతజయంతి సంవత్సరంలో ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, ప్రచార ప్రముఖ్ బయ్యా శ్రీనివాసులు తెలియజేసారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతీయేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఈ యేడాది మార్చి 21, 22, 23 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఆ కార్యక్రమం వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘచాలక్ హరికుమార్ రెడ్డి, ప్రచార ప్రముఖ్ బయ్యా శ్రీనివాసులు తెలియజేసారు. వార్షిక సమావేశంలో ప్రధానంగా శతజయంతి సంవత్సరంలో సంస్థ విస్తరణ గురించి తీర్మానించుకున్న సంగతి వెల్లడించారు.
మొదట హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ విస్తరణ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ లక్ష్యాల గురించి వివరించారు. సంఘ్ ‘సర్వస్పర్శి, సర్వవ్యాప్తి’ లక్ష్యంగా.. అంటే సమాజంలో అందరినీ చేరుకోవాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనే లక్ష్యంతో ముందుకు వెడుతోంది. దానికోసం దేశంలో ప్రతీరోజూ శాఖలు, వారానికోసారి మిలన్‌లు, నెలకొకసారి బైఠక్‌లూ నిర్వహిస్తోంది. 2025 మార్చి 13 నాటికి ఆ గణాంకాలను పరిశీలిస్తే… 51,570 ప్రదేశాల్లో మొత్తం 83,129 శాఖలను నిర్వహిస్తోంది. వారానికి ఒకసారి జరిగే సాప్తాహిక్ మిలన్‌లు, నెలకు ఒకసారి జరిగే మండల్ బైఠక్‌లూ కలుపుకుంటే ఆ సంఖ్య 1,27,367గా ఉంది.
గత మూడేళ్ళుగా సంఘం గ్రామీణ మండలాలపై దృష్టి సారించింది. దేశం అంతటినీ 58,981 గ్రామీణ మండలాలుగా విభజిస్తే వీటిలో 30,717 మండలాల్లో రోజువారీ శాఖలు, 9,200 మండలాల్లో వారానికోసారి సాప్తాహిక్ మిలన్‌లు, అంటే మొత్తం 39,917 మండలాలలో శాఖలు జరుగుతున్నాయి. సంస్థ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపు మేరకు 2,453 మంది స్వయంసేవకులు శతాబ్ది విస్తారకులుగా రెండేళ్ల పాటు తమ ఇళ్ళను విడిచిపెట్టి సంఘ్ పని విస్తరణ, ఏకీకరణ కోసం కృషి చేస్తున్నారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో ఈ ఏడాది 2,101 స్థలాలలో సంఘ కుర్యక్రమాలు జరిగాయి. వాటిలో 990 శాఖా స్థలాల్లో 1559 దైనందిన శాఖలు, 934 సాప్తాహిక్ మిలన్‌లు, 415 మండలి సమావేశాలు జరిగాయి.
దేశంలో నవతరం యువకులు పెద్దసంఖ్యలో సంఘ్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రత్యేకించి 14-25 యేళ్ళ వయస్సులోని వారు స్వయంసేవకులుగా ఆర్.ఎస్.ఎస్.లో చేరుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,415 ప్రారంభ శిబిరాలు జరిగాయి. ఆ వర్గలకు 2,22,962 మంది హాజరయ్యారు. వారిలో 1,63,000 మంది 14-25 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. వారిలో 20,000 మందికి పైగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇవాళ దేశంలో 1 కోటి మందికి పైగా స్వయంసేవకులు ఉన్నారు. వారు సామాజిక సేవ, కార్మిక సంఘాలు, వ్యవసాయం వంటి వివిధ సామాజిక విభాగాల్లో పనిచేస్తున్నారు.
ఇదే సంవత్సరం కర్ణాటకకు చెందిన గొప్ప మహిళ, స్వతంత్ర సమర యోధురాలు మహారాణి అబ్బక్క 500 జయంతి కూడా జరుగుతోంది. ఆ సందర్భంగా సంఘం ఆమెకు ఘన నివాళులు అర్పించింది. ఆమెను ప్రేరణగా తీసుకుని సంఘం చేపట్టిన జాతి నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని, సమాజానికి సహకరించాలని ప్రజలకు సంఘ్ పిలుపునిచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్‌రెడ్డి తెలియజేసారు. ఈ శతాబ్ది సంవత్సరంలో భాగంగా, పంచ పరివర్తన ద్వారా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పర్యావరణం, స్వ, పౌర విధులను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రచార్ ప్రముఖ్ బయ్యా శ్రీనివాసులు వెల్లడించారు.