అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలపై పైసా భారం పడనీయబోమని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిర్మాణంలో ఉన్న ఉన్నతాధికారుల బంగ్లాలను, సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయాన్నీ మంత్రి పరిశీలించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘‘రాజధాని నిర్మాణంలో భాగంగా గతంలో మేము 43 వేల కోట్లకు టెండర్లు పిలిచాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వం వాటిని పట్టించుకోనే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐఐటీ మద్రాస్ నుంచి నిపుణుల బృందం భవనాల నాణ్యతను పరిశీలించింది. వారు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి, కొన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పారు. 90 శాతం పనుల టెండర్లు పూర్తయాయి’’ అని వివరించారు.
మంత్రులు, జడ్జీలు, ప్రధాన కార్యదర్శులు, ఇతర కార్యదర్శులకు 186 భవనాలు వస్తున్నాయని మంత్రి తెలియజేసారు. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయి. హైకోర్టు 16.85 లక్షల చదరవు అడుగుల్లో వస్తోంది. 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం రానుంది. 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాతనే అప్పు తీరుస్తామని నారాయణ చెప్పారు.