తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో రూ.5258 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. సాధారణ భక్తులకు మెరుగైన వసతి సదుపాయం కల్పించేందుకు రూ.772 కోట్ల ఖర్చుతో 7282 గదులు నిర్మించాలని నిర్ణయించారు. బ్రేక్ దర్శనం సమయాల మార్పుపై అధ్యయనం చేయనున్నారు.
తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. స్వామి వారి భూమి ఒక్క అంగుళం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. అలిపిరి గేటు వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి లీజుకు ఇచ్చిన భూములను రద్దు చేశారు. దేవలోక్, ఎంఆర్‌కేఆర్ సంస్థలకు భూముల కేటాయింపులను కూడా రద్దు చేశారు. పర్యాటకశాఖకు ఇచ్చిన 15 ఎకరాలు కూడా వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.
శ్రీవాణి ట్రస్టుకు అదనంగా మరో ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణాలకు ముందుకురావాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే విధులు నిర్వహిస్తారని ఛైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. వృద్ధులు, వికలాంగులకు ఆన్‌లైన్ టికెట్లతోపాటు, ఆఫ్ లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నాసిరకం సరుకులు అందిస్తున్న శ్రీనివాస సేవాసమితిని బ్లాక్ లిస్టులో పెట్టారు. వారికి దర్శనాలకు కేటాయించిన 25000 కూపన్లు రద్దు చేశారు. గతంలో ఏర్పాటైన ఆగమ సలహా మండలి స్థానంలో, ఐదుగురిని కొత్తవారిని తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.