ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అయిదేళ్ళ లో 20 వేల స్టార్టప్‌లు సృష్టించి కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29’ని ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్‌లను ఏర్పాటు చేసేవారితో పాటు ఇంక్యుబేటర్లు, ఇప్పటికే స్టార్టప్‌లను ఏర్పాటు చేసినవారు కూడా ఆర్థిక, ఆర్థికేతర మద్దతు కోరుతూ ఈ పాలసీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి భాస్కర్ కాటమనేని సోమవారం పాలసీ విధివిధానాలు విడుదల చేశారు.
కొత్త సవాళ్లను పరిష్కరించడానికి మరియు సాంకేతికత జోడింపు, మార్కెట్ డైనమిక్స్ మరియు స్టార్టప్ వ్యవస్థాపకుల అభివృద్ధి చెందుతున్న అవసరాలలో పురోగతికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏపీ 2014లో, భారతదేశపు మొట్టమొదటి స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ పాలసీని ప్రవేశపెట్టడంతో దేశానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ (2024-29) లక్ష్యాలు ఇలా ఉన్నాయి …
ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో ప్రపంచకేంద్రంగా మార్చడంతో పాటు స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చేలా బలమైన వ్యవస్థను నిర్మించడం, ఆర్థికాభివృద్ధి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ఈ పాలసీ ఉద్దేశం. రాష్ట్రంలో 20 వేల స్టార్ట్ ప్ లు ఏర్పాటు చేసి కనీసం లక్షమందికి పని కల్పించాలి.
డీప్‌టెక్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్, ఐఓటీ, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఐఓటీ, క్వాంటం కంప్యూటింగ్, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, బయోటెక్, లైఫ్ సైన్స్, మెడ్‌టెక్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, త్రీడీ పెయింటింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, ఆటోమోటివ్, ఈవీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో 10 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను సృష్టించడం, విస్తరించడం.
ఏడాదికి కనీసం 25 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌ల సృష్టించడంతో పాటు వాటి అమలుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
5 హబ్ అండ్ స్పోక్‌ల వ్యవస్థ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి. అమరావతిలో రతన్‌టాటా హబ్, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో 5 స్పోక్ కేంద్రాలు ఉంటాయి.
విద్యార్థులు, స్టార్టప్‌లకు ప్రారంభ గ్రాంట్ కింద రూ.2 లక్షల వరకు అందిస్తారు.స్టార్టప్ ఉత్పత్తి దశకు చేరుకునే వరకు గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు విడతల వారీగా కేటాయిస్తారు. గ్రాండ్ ఛాలెంజెస్, హాకథాన్‌లకు ప్రోత్సాహకాలను ఆయా సమయాల్లో ప్రకటిస్తారు.
మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, ఇతరుల స్టార్టప్‌కు రూ.20 లక్షల వరకు దశల వారీగా ప్రోత్సాహకం ఉంటుంది. అలాగే
టర్మ్ రుణాలపై మూడేళ్ల వరకు 8 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ఈక్విటీ షేరింగ్ మోడల్‌లో రూ.50 లక్షల వరకు ,ఈవెంట్స్/ ఫెయిర్స్‌కు హాజరైతే రిజిస్ట్రేషన్, రవాణా, ఇతర ఖర్చుల్లో 75 శాతం, గరిష్ఠంగా రూ.3 లక్షలు….ఈక్విటీ సీడ్ ఫండింగ్ రూ.50 లక్షల వరకు, మార్కెట్ మద్దతుకు రూ.50 లక్షల వరకు పేటెంట్ ఖర్చుల్లో 50 శాతం ఇస్తారు.
గరిష్ఠంగా భారత పేటెంట్‌లో రూ.2 లక్షలు, విదేశీ పేటెంట్‌లో రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు.
ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ద్వారా స్టార్టప్‌లకు మద్దతు కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అయిదు ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవడంతో అవసరమైన సాయం పొందవచ్చు. గుర్తించిన కో వర్కింగ్, ఎంఎస్‌ఎంఈ పార్కుల్లోని వర్క్‌స్టేషన్లకు 100 శాతం అద్దె రాయితి. ఫండింగ్, మెంటార్‌షిప్‌కు అభ్యర్థన, ఇంక్యుబేషన్ సేవలు, ఇతర మద్దతు కోరవచ్చు. గ్రాంట్లు, రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు, మౌలిక సౌకర్యాలకు మద్దతు, ఇతర పథకాల ద్వారా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ద్వారా స్టార్టప్‌లు.. ఫండింగ్, మెంటార్‌షిప్‌కు అభ్యర్థన, ఇంక్యుబేషన్ సేవలు, ఇతర మద్దతు కోరవచ్చు.
గ్రాంట్లు, రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు, మౌలిక సౌకర్యాలకు మద్దతు, ఇతర పథకాల ద్వారా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందంటూ ప్రమోషన్ చేసే బాధ్యతను ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు(ఈడీబీ)కు అప్పగిస్తూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈడీబీ ఆకర్షించి తెచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా భూములు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చే బాధ్యతను ఏపీఐఐసీ తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వశాఖల మధ్య ‘వర్క్ డివిజన్’ను స్పష్టం చేస్తూ సోమవారం ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులిచ్చారు.