స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం ప్రదర్శించిన ఒక షోలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని ‘ద్రోహి’ అంటూ వెక్కిరించడం శివసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. శివసైనికులు కునాల్ కమ్రా మీద కేసు పెట్టడం మాత్రమే కాదు, ఆ షో నిర్వహించిన హోటల్ మీద దాడి చేసారు.
కునాల్ కమ్రా తన షోలో షారుఖ్ ఖాన్ సినిమా ‘దిల్ తో పాగల్ హై’లోని టైటిల్ సాంగ్‌ని పేరడీ చేస్తూ ఏకనాథ్ షిండేని ద్రోహిగా వర్ణించాడు. దాన్ని శివసేన వ్యతిరేక రాజకీయ పార్టీలు వైరల్ చేసాయి. దాంతో శివసైనికులు చెలరేగిపోయారు.
కునాల్ కమ్రాకు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. స్టాండప్ కామెడీలో భాగంగా కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సహజమే. కానీ అవి శ్రుతి మించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. అలా గీత దాటి వివాదాలు సృష్టించడంలో కునాల్ దిట్ట. కేవలం హాస్యానికే కాదు, కునాల్ ఉద్దేశపూర్వకంగానూ వివాదాలు సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని సందర్భాలు చూద్దాం.
(1) అర్ణబ్ గోస్వామి మీద రచ్చ:
2020లో ముంబై నుంచి లక్నో వెడుతున్న ఇండిగో విమానంలో రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్ణబ్ గోస్వామిని కునాల్ కమ్రా అపహాస్యం పాలు చేసాడు. అంతేకాదు, దాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) అకౌంట్లోనూ పోస్ట్ చేసాడు.
ఆ వీడియోలో కమ్రా మాట్లాడుతుంటే స్పందించకుండా అర్ణబ్ గోస్వామి సంయమనం పాటించాడు. ‘‘చూడండి, పిరికిపంద అర్ణబ్ గోస్వామిని నేను తన జర్నలిజం గురిచి అడుగుతున్నాను. అతను ఏం చేస్తాడని నేను అనుకున్నానో సరిగ్గా అదే చేస్తున్నాడు’’ అంటూ నోరు పారేసుకున్నాడు.
ఆ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వంటివారు సమర్థించారు. అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాత్రం కమ్రా ప్రవర్తన నేరపూరితంగా ఉందన్నారు.
ఆ సంఘటనపై ఇండిగో యాజమాన్యం దర్యాప్తు జరిపించింది. కునాల్ కమ్రా ప్రవర్తనను మొదటి స్థాయి నేరంగా పరిగణించి, అతని మీద ఆరు నెలలు నిషేధం విధించింది. తర్వాత ఆ నిషేధాన్ని మూడు నెలలకు కుదించింది. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, గోఎయిర్ వంటి మిగతా విమానయాన సంస్థలు కూడా కమ్రా మీద అటువంటి నిషేధమే విధించాయి.
(2) సల్మాన్ ఖాన్ మీద జోకులు:
ఈ నెల మొదట్లోనే కునాల్ కమ్రా సల్మాన్ ఖాన్ మీద తన షోలో వివాదాస్పదమైన జోకులు వేసాడు. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా ఈ నెలాఖరులో విడుదల కానుంది. కునాల్ కమ్రా సల్మాన్ ఖాన్ మీద దాఖలైన రెండు కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పదంగా మాట్లాడాడు. అవి… 1998లో కృష్ణజింక వేట కేసు, 2002 నాటి హిట్-అండ్-రన్ కేసు. ఆ రెండో కేసును సాక్షులు నిలకడగా లేరన్న కారణంతో బొంబాయి హైకోర్టు కొట్టివేసింది.
(3) ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌తో గొడవ:
కునాల్ కమ్రా ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్‌ను సోషల్ మీడియాలో దుయ్యబట్టాడు. ఓలా కంపెనీ తమ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని, రిఫండ్ వ్యవహారాలను పరిష్కరించడం లేదనీ, ఇంకా చాలా ఆరోపణలు చేసాడు.
అంతకు కొన్నాళ్ళ ముందు ఎక్స్ మాధ్యమంలో కునాల్ కమ్రా, భవీష్ అగర్వాల్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఒక ఓలా స్టోర్ బైట నిలబడి ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి కునాల్ రకరకాల కామెంట్లు చేసాడు. దానికి స్పందనగా భవీష్ అగర్వాల్ కునాల్‌కు సవాల్ విసిరాడు. ‘‘నీకు అంత ఆందోళనే ఉంటే మాకు సాయం చేయవచ్చు కదా? అలా చేయలేనప్పుడు నోరు మూసుకుని, మమ్మల్ని కస్టమర్ల నిజమైన సమస్యలు పరిష్కరించుకోనివ్వు’’ అంటూ భవీష్ ఘాటుగా జవాబిచ్చాడు.
(4) సీజేఐకి మధ్యవేలు చూపించిన కునాల్:
2020లో కునాల్ కమ్రా అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డేనే అపహాస్యం చేస్తూ ట్వీట్ చేసాడు. తన చేతికున్న రెండు వేళ్ళ ఫొటో పెట్టి ‘‘ఈ రెండింటిలో ఒకటి సీజేఐ బోబ్డే కోసం. సరే, నేను మిమ్మల్ని అయోమయపరచను. అది మధ్యవేలే’’ అని రాసుకొచ్చాడు.
ఎవరికైనా మిడిల్ ఫింగర్ చూపించడమనేది ఒక అసభ్యకరమైన, అవమానకరమైన చర్య. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే అలా చూపించాడు కునాల్ కమ్రా. 2018 నాటి ఒక కేసులో అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు అప్పట్లో మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కునాల్ సీజేఐకి మధ్యవేలు చూపించాడు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడంటూ కునాల్ కమ్రా మీద అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధిక్కారం కేసు పెట్టారు.
(5) చిన్న పిల్లవాడి వీడియోను మార్ఫింగ్ చేసిన వివాదం:
2020 మేలో కునాల్ కమ్రా ఒక చిన్నపిల్లవాడి వీడియోను మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అది వివాదానికి దారితీసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏడేళ్ళ ఒక పిల్లవాడు మోదీ ముందు పాట పాడాడు. ఆ వీడియోని కునాల్ ఎడిట్ చేసాడు. పిల్లవాడు పాడిన పాటను తీసేసి ఒక సినిమా పాటను పెట్టి, ఆ ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేసాడు.
ఆ పిల్లవాడి తండ్రి గణేష్ పోల్ దానిపై తీవ్రంగా మండిపడ్డారు. కునాల్ నీచ రాజకీయాలకు తన కొడుకును వాడుకోవడం సరి కాదంటూ ఘాటుగా స్పందించారు. అయితే తాను పిల్లవాడిని కించపరచలేదని కునాల్ అన్నాడు. మోదీని అపహాస్యం చేయాలనేదే తన ఉద్దేశమని స్పష్టం చేసాడు.
ఆ వ్యవహారాన్ని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కునాల్ చేసిన ట్వీట్‌ను తొలగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను, ట్విట్టర్ సంస్థ యాజమాన్యాన్నీ ఆదేశించింది. చివరికి కునాల్ స్వయంగా తనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసాడు.
(6) సుప్రీం కోర్టు మీద బ్రాహ్మణ్-బనియా వ్యాఖ్య:
కునాల్ కమ్రా తన షో ‘బి లైక్’లో ఒక సందర్భంలో సుప్రీంకోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసాడు. సుప్రీంకోర్టు అనేది బ్రాహ్మణులు-బనియాలకు (వైశ్యులు) చెందిన వ్యవహారం అని వ్యాఖ్యానించాడు. దానిమీద సుప్రీంకోర్టులో 2020 మే నెలలో పిటిషన్ దాఖలైంది. అంతకుముందే కునాల్ కమ్రా మీద కోర్టు ధిక్కారం కేసు పెండింగ్‌లో ఉంది. దాని విచారణలో ఇంటర్వెన్షన్ అప్లికేషన్లా ఈ పిటిషన్‌ను జత చేసారు.
2021 మొదట్లో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, కునాల్ కమ్రా మీద కోర్టు ధిక్కారం కేసు ప్రొసీడింగ్స్‌ను ఆమోదించారు. కునాల్ కమ్రా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయ వ్యవస్థనూ, న్యాయమూర్తులనూ అవమానిస్తున్నడంటూ ఆ పిటిషన్‌ను ఆమోదించారు.
కునాల్ కమ్రా దానికి స్పందిస్తూ ‘‘దేశంలో అసహనం పెరిగిపోతోంది, ఏం మాట్లాడినా దాన్ని నేరంగా పరిగణించడం ప్రాథమిక హక్కు అయిపోతోంది, అలా చేయడం మన జాతీయ క్రీడ స్థాయికి ఎదిగిపోయింది’’ అంటూ మళ్ళీ ఎద్దేవా చేసాడు.
(7) విశ్వహిందూ పరిషత్ మీద విమర్శలు:
2022 సెప్టెంబర్‌లో కునాల్ కమ్రా విశ్వహిందూ పరిషత్ మీద విరుచుకుపడ్డాడు. మీది హిందూ అనుకూల, ఉగ్రవాద వ్యతిరేక సంస్థ అని నిరూపించుకోవాలంటూ మీరు గాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేని నిందించండి అంటూ సవాల్ విసిరాడు. తను హిందూమతాన్ని ఎక్కడ అగౌరవపరిచాడో నిరూపించాలని డిమాండ్ చేసాడు.
ఆ సమయంలో ఢిల్లీ దగ్గర గురుగ్రామ్‌లో కునాల్ కమ్రా ప్రదర్శన ఒకటి ఏర్పాటయింది. దాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో తాము అవాంతరాలు కలగజేస్తామనీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ హెచ్చరించాయి. దాంతో నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆ సందర్భంలో కునాల్ కమ్రా విహెచ్పి మీద నోరు పారేసుకున్నాడు.
‘‘నేను ప్రభుత్వం మీద మాత్రమే వ్యంగ్యోక్తులు విసురుతాను. మీరు ప్రభుత్వానికి పెంపుడు జంతువు అయితేనే మీ మనోభావాలు గాయపడతాయి. ఇందులో హిందూమతానికి సంబంధం ఏముంది? దేవుడితో నా బంధం గురించి ఎవరికీ నిరూపించుకోను. కానీ మీ దగ్గర నిరూపించుకుంటాను, అలాగే మిమ్మల్నీ పరీక్షిస్తాను. నేను జై సీతారామ్, జై రాధాకృష్ణ అని గర్వంగా ఎలుగెత్తి అంటాను. మీరు నిజంగా భారతదేశ పుత్రులే అయితే గాడ్సే ముర్దాబాద్ అనండి. అలా అనకపోతే నేను మిమ్మల్ని హిందూ వ్యతిరేకులు, ఉగ్రవాద అనుకూలురు అని భావిస్తాను. మీరు గాడ్సేని దేవుడిగా భావించడం లేదు కదా?’’ అంటూ రాసుకొచ్చాడు.