మన ఉత్తరాంధ్ర అడవుల్లో గిరిజనులు తయారు చేసే అరకు కాఫీ రుచిని ఇకపై పార్లమెంటులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులూ ఆస్వాదించనున్నారు. నేటినుంచీ పార్లమెంటు క్యాంటీన్‌లలో రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన సహకార సంస్థ పార్లమెంటులోని సంగమ్ క్యాంటీన్‌లో రెండు కాఫీ స్టాళ్ళు ప్రారంభించింది. స్పీకర్ అనుమతి మంజూరు చేసినందున రెండు కాఫీ స్టాల్స్ పెట్టుకోవాలంటూ లోక్‌సభ బిల్డింగ్స్ డైరెక్టర్ కులమోహన్ సింగ్ అరోరా ఆదేశాలు జారీ చేసారు. ఈ నెల 28 వరకూ స్టాల్స్ పెట్టుకోడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత పార్లమెంటు క్యాంటీన్‌లో నిరంతరాయంగా ఈ స్టాల్‌లో అరకు కాఫీ గుమగుమలు పరిమళిస్తాయి.
ఉత్తరాంధ్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అరకు పరిసర ప్రాంత అడవుల్లో గిరిజన కోపరేటివ్ సొసైటీ సహకారంతో స్థానిక గిరిజనులకు కాఫీ సాగు చేసి పొడి తయారు చేస్తున్నారు. దాన్ని అరకు కాఫీ అనే బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. దానిగురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే దేశ విదేశీ విపణుల్లో మంచి పేరు సంపాదించుకున్న అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంటు క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు రాష్ట్ర ఎంపీలు ప్రయత్నించి సఫలమయ్యారు.
లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్‌లోని స్టాల్‌ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అరకు కాఫీ గురించి ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పార్లమెంటు ఆవరణలో స్టాల్‌కు అవకాశం కల్పించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసారు.