నాగపూర్ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చి వేతలు మొదలయ్యాయి. మార్చి 17న నాగపూర్ నగరంలో హింసను ప్రేరేపించిన వారిని గుర్తించి వారి ఇళ్లు, అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ ఇవాళ ఉదయం మొదలైంది. నాగపూర్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడు ఫహీమ్‌ఖాన్ ఇంటిని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.నాగపూర్ అల్లర్ల వెనుక ఇతను కీలక కుట్రదారుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు, ఇవాళ ఉదయం ఫహీమ్ ఖాన్ నివాసాలు, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
నాగపూర్ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు పోలీసులు 200 మందిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో 1000 మందిని గుర్తించే పనిలో ఉన్నారు. 50 మంది సోషల్ మీడియా నిర్వాహకులపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆరుగురిపై నగరబహిష్కరణ వేటు వేశారు.
ఓ మతానికి చెందిన గ్రంథాలు తగులబెట్టారంటూ కొందరు దుండగులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో నాగపూర్ నగరంలో మార్చి 17న అల్లర్లు చెలరేగాయి. పలు ప్రాంతాలకు విస్తరించాయి.దుంగడులు కార్లు, బైకులు కాల్చివేయడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ తీవ్ర చర్యలకు సిద్దమైంది. ఆస్తి నష్టం చేసిన వారి ఆస్తులు అమ్మి నష్టపోయిన వారికి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.