అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధాన నగరం విజయవాడలో అన్ని రెస్టారెంట్లు, హోటళ్ళూ అర్ధరాత్రి వరకూ తెరచి ఉంటాయి. ఈ తాజా నిర్ణయం నిన్న ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. విజయవాడతో పాటు ఎన్టిఆర్ జిల్లా అంతా హోటళ్ళు, రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకూ తెరచి ఉంచవచ్చునంటూ పోలీసులు అనుమతి మంజూరు చేసారు.
నిజానికి విజయవాడలో హోటళ్ళను అర్ధరాత్రి వరకూ తెరచి ఉంచవచ్చునంటూ 2018లోనే ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఆ ఉతర్వులు అమల్లోకి ఇప్పుడు వస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసారు. మొదట మూడు నెలలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. జనాదరణ బాగా లభిస్తే మూడు నెలల తర్వాత ఇదే విధానాన్ని కొనసాగిస్తామని కమిషనర్ ప్రకటించారు.
విజయవాడలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ప్రకారం రాత్రి 9.30 దాటితే చాలు దాదాపు అన్ని హోటళ్ళూ మూతపడిపోతాయి. కానీ రైళ్ళు, బస్సుల్లో నగరానికి ఆ సమయంలో చేరుకునే వారు వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారికి ఆహారం కావాలంటే ఫుడ్ కోర్టులను, ఈట్ స్ట్రీట్స్‌నూ వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. అలాగే, గతంతో పోలిస్తే గత దశాబ్ద కాలంలో విజయవాడలో రాత్రి పూట జనసంచారం బాగా పెరిగింది. రాత్రులు విధులు నిర్వహించే వారూ ఎక్కువయ్యారు. ఇలాంటి కారణాల వల్ల హోటళ్ళు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు.
రాష్ట్ర హోటళ్ళ సంఘంలో సభ్యత్వం ఉన్నవాటిలో విజయవాడకు చెందిన రెస్టారెంట్లు 144, హోటళ్ళు 46 ఉన్నాయి. సభ్యత్వం లేకుండా 200కు పైగా చిన్నా పెద్దా హోటళ్ళు ఉన్నాయి. గత విధానం ప్రకారం వాటిని రాత్రి 10 గంటలకు మూసివేయాలి. అంటే 9.30 నుంచే సర్దుడు పనులు మొదలుపెట్టుకోవాలి. ఈట్ స్ట్రీట్‌లో, ఫుడ్‌కోర్టుల్లో వ్యాపారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది. నిజానికి వారు ప్రభుత్వానికి ఏ పన్నులూ కట్టడం లేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు మాత్రం 13 రకాల పన్నులు కడుతున్నాయి.
మరోవైపు, రాష్ట్రంలోని మరో పెద్ద నగరం విశాఖపట్నంలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. దానివల్ల ప్రజలకు సౌకర్యం అందుబాటులో ఉంటుంది, హోటళ్ళ మనుగడ కూడా మెరుగుపడుతుంది. అందువల్ల తమకు కూడా అర్ధరాత్రి వరకూ వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. అదే అంశాన్ని ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును కూడా అభ్యర్ధించారు. దానికి వారందరూ సానుకూలంగా స్పందించారు. ఫలితంగా ఈ ఆదివారం నుంచీ ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది.