ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది, బెట్టింగ్ జోరుగా సాగుతుంది అనే అంచనాలతో నిఘా వేసిన బెజవాడ పోలీసులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నగరంలో బెట్టింగ్ కార్యకలాపాలకు ప్రఖ్యాతి గడించిన బుకీలు కొద్ది రోజుల నుంచీ కనిపించడం లేదు.
గతంలో విజయవాడ పోలీసులు క్రికెట్ సీజన్లో బెట్టింగ్రాయుళ్ళ మీద నిఘా పెట్టి కొంతమంది బుకీలను ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. అయోధ్యనగర్, బావాజీపేట, చిట్టినగర్, కొత్తపేట, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన బుకీలను పోలీసులు గతంలో బుక్ చేసారు. వారిలో కొంతమంది మీద రౌడీషీట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ ప్రారంభమైన సందర్భంలో వారి మీద పోలీసులు నిఘా పెంచారు. అయితే, ఖాకీచూపులు తమమీద పడకముందే బుకీలు ఈసారి వ్యూహం మార్చారు.
అయోధ్యనగర్‌కు చెందిన ప్రధానమైన బుకీ బెంగళూరు తరలివెళ్ళిపోయాడని సమాచారం. అతని కుటుంబ సభ్యులు సైతం నగరంలో లేరు. ఇంటికి తాళం పెట్టి ఊరికి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అతనికి ముంబైకి చెందిన బెట్టింగ్ ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రెండు సంవత్సరాల క్రితమే స్పష్టంగా తెలిసింది. అతనికి బావాజీపేటకు చెందిన కొంతమంది బుకీలతో స్నేహ సంబంధాలున్నాయి. ఆ బుకీల్లో ఒక్కరైనా ఇప్పుడు నగరంలో లేరని తెలుస్తోంది. వాళ్ళు పర్యాటకుల వేషాల్లో గోవా చేరుకున్నారని సమాచారం.
బెట్టింగ్ రాయుళ్ళను పట్టుకోవడంలో పోలీసులకు మరో కీలకమైన సమస్య తలెత్తింది. గతంలో బుకీలు మొబైల్ ఫోన్ల సహాయంతో బెట్టింగ్ నిర్వహించేవారు. ఫోన్లో ఇన్ఫర్మేషన్ సేకరించి, బెట్ వివరాలను రాతపూర్వకంగా నమోదు చేసుకునేవారు. అందువల్ల మొబైల్ నెంబర్లను ట్రేస్ చేస్తే బుకీలు, బెట్టింగ్ రాయుళ్ళూ సులువుగా దొరికేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చేసింది. దాంతో బుకీలను పట్టుకోవడం చాలా కష్టంగా మారింది.
ఇప్పుడు మొబైల్ ఫోన్స్‌లో అన్ని రకాల యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల బెట్టింగ్ రాయుళ్ళు సైతం తామూ ఫోన్ యాప్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. దానివల్ల వారి ఉనికి తెలియదు. బెట్టింగ్ యాప్స్‌లో గ్రూపులు క్రియేట్ చేసుకుని పందేలు ఒడ్డుతున్నారు. అందువల్ల వారిని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు.
విజయవాడ నగరంలో ముఖ్యమైన బుకీలకు చిట్టినగర్, వన్‌టౌన్, గవర్నర్‌పేట వంటి ప్రాంతాల్లో బెట్టింగ్ రాయుళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి. మ్యాచ్‌లో బెట్టింగ్ కూడా రకరకాలుగా జరుగుతుంది. ప్రతీ ఓవర్‌కు, ప్రతీ బాల్‌కూ బెట్లు కడతారు. దానికోసం యాప్స్‌లో వెసులుబాటు ఉండడం వల్ల బెట్టింగ్ నిర్వహణ చాలా సులువైపోయింది. అదే సమయంలో, ఎక్కడి నుంచయినా వారు బెట్టింగ్ నిర్వహించవచ్చు. వారిని పట్టుకోవడం మాత్రం పోలీసులకు తలకు మించిన పనిగా మారిపోయింది. టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ భూతం విస్తరిస్తున్నా దాన్ని నిలువరించే శక్తియుక్తులు పోలీసుల దగ్గర పెద్దగా కనిపించడం లేదు.
బుకీలు కనిపించడం లేనంత మాత్రాన బెజవాడలో బుకింగే జరగడం లేదనుకోవడం సరికాదని పోలీసులే చెబుతున్నారు. మెయిన్ బుకీలు దొరికేంత వరకూ నగరంలో జరుగుతున్న బెట్టింగ్ వివరాలు వెలుగు చూడడం కష్టమేనని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.