హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని త్రిభాషా విధానం చెప్పడం లేదని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన తంతి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్రిభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
జనసేన 12వ ఆవిర్భావ ఉత్సవాల్లో జయకేతనం సభలో త్రిభాషా విధానం గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఏపీలో 30 తమిళ బడులు, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృత, 400 ఉర్దూ, 37 వేల తెలుగు పాఠశాలలున్నాయని గుర్తుచేశారు. మాతృభాషలో విద్యార్థులకు సులభంగా ప్రాథమిక విద్య అందించేందుకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హిందీ వల్ల తమిళభాషకు ముప్పు పొంచిఉందనే భావన తమిళ ప్రజల్లో ఉందనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ, ఏ భాషనూ బలవంతంగా రుద్ద కూడదన్నారు. అలా చేస్తే తానే మొదటగా వ్యతిరేకిస్తానని బదులిచ్చారు.నన్ను తమిళం నేర్చుకోవాలని ఎవరూ బలవంతం చేయలేదని, నేనే స్వయంగా నేర్చుకున్నానంటూ పవన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
త్రిభాషా విధానంలో హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఎక్కడా లేదని, ఏ భాష నేర్చుకోవాలనే ఐచ్ఛికాలు ఉన్నాయని తెలిపారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం తెలుసన్నారు. హిందీ నేర్చుకోవడం వల్ల తెలుగు భాషకు దూరం కాలేదని, మరింత దగ్గరయ్యానని చెప్పారు. ఎక్కడో ఉన్న బ్రిటిష్ వారి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేని భయం, హిందీ నేర్చుకోవడానికి ఎందుకని ప్రశ్నించారు.
దక్షిణాదికి చెందిన పలువురు నాయకులు హిందీ మాట్లాడుతున్నారని, అయినా వారు కూడా హిందీని వ్యతిరేకిస్తున్నారని పవన్ గుర్తుచేశారు. త్రిభాషా విధానాన్ని బలవంతంగా రుద్దడంగా చూడటం లేదని, పలు భాషలు నేర్చుకోవడాన్ని అవకాశంగా చూడాలన్నారు. ఏపీ, కర్ణాటకలో త్రిభాషా విధానం సహజమన్నారు.ఈ విధానం ప్రభుత్వానికి అదనపు వ్యయంగా భావించడం లేదని, ఈ విధానం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తుందన్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంపై ప్రశ్నించగా..ముందుగా పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని, తరవాత పోరాడాలన్నారు. అలా కాకుండా నేరుగా రోడ్లపైకి వస్తే ఎలా అంటూ పవన్ ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ లేకుంటే వారి విధానం మరోలా ఉండేదన్నారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గవని తాను భావిస్తున్నానని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో జనసేనను విస్తరించి, మీ భావజాలాన్ని ముందుకు తీసుకెళతారా అని ప్రశ్నించగా, అలాంటిదేం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. తమిళనాడులో కాంగ్రెస్‌ను అన్నాదురై ఓడించలేదా అని ప్రశ్నించారు.తాను రాజకీయాల్లో ఎదిగిన తీరును చూసి తన సోదరుడు చిరంజీవి చాలా ఆనందం వ్యక్తం చేసినట్లు చెప్పారు.