అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ హొసబళే, వారి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. వక్ఫ్ బిల్లు గురించి అడిగిన ప్రశ్నకు… ప్రభుత్వ వక్ఫ్ బిల్లు మీద ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది, ఆ కమిటీ సరైన దిశలో పని చేస్తోంది అని చెప్పారు.
ఔరంగజేబు వివాదం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. చారిత్రక వాస్తవాలను గుర్తించాల్సిన అవసరముంది అన్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్‌గా పేరు మార్చడానికి ఓ ప్రయోజనం ఉందన్నారు. భారతదేశపు నైతిక విలువలకు విరుద్ధమైన వారిని గొప్పగా చూపుతున్నవారు దారా షికోను ఎందుకు భారతదేశపు ఘనతగా చూపలేదని ప్రశ్నించారు. ఈ దేశపు అభ్యున్నతి కోసం, సాంస్కృతిక వారసత్వం కోసం పనిచేసిన వారిని గౌరవించుకోవాలే తప్ప ఈ దేశపు విలువలను వ్యతిరేకించే వారిని కాదని స్పష్టం చేసారు.
కుల ఆధారిత జనగణన గురించిన ప్రశ్నకు జవాబుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మత ఆధారిత రిజర్వేషన్లు లేవన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన గురించి అడిగినప్పుడు ‘‘డీలిమిటేషన్ మీద రాజకీయ నాయకులు ఏ ప్రకటనలైనా చేయవచ్చు, కానీ ఇప్పటివరకూ కనీసం ముసాయిదా అయినా లేని అంశం మీద సంఘ్ స్పందించదు’’ అని చెప్పారు.
మణిపూర్ వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆ విషయంలో సంఘ్ కొన్ని సలహాలు ఇచ్చిందని, మణిపూర్‌కు సంబంధించి కొన్ని సమస్యలను పరిష్కరించిందనీ చెప్పారు. అయితే ఆ విషయమై నిర్దిష్టమైన కార్యాచరణ గురించి డిమాండ్ చేయలేదు. పరిస్థితిని బట్టి ప్రభుత్వం అడుగులు వేసింది. పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావం ఉంది. రాష్ట్రంలో శాంతి సామరస్యాల గురించి మెయితీలు, కుకీలు ఇద్దరూ ఆశావాదంతో ఆలోచించడం మొదలు పెట్టారన్నారు.
రామమందిర నిర్మాణం సమాజం ఘనత, సంఘ్‌ది కాదు… అది జాతి ఐక్యతను, సమగ్రతనూ మరింత బలపరుస్తోందని వివరించారు. హిందువుగా ఉండడం గర్వకారణం, అవమానం కాదు. హిందువు ఒక జాతీయవాది, సాంస్కృతిక అస్తిత్వం, ఆధ్యాత్మిక మనుగడ, కేవలం మతం కాదు. హిందూ సమాజంలో జాగృతి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అంటరానితనాన్ని నిర్మూలించడం వంటి కొన్ని దిద్దుబాట్లు నేటికీ కావాలి’’ అని చెప్పారు.
కులాంతర వివాహాల గురించి ప్రశ్నించినప్పుడు స్వయంసేవకులు కులాంతర వివాహాలను ఎప్పుడూ ప్రోత్సహించారన్నారు. భారతదేశంలో జన్మించిన వారంతా హిందువులే, శాఖకు హాజరయ్యేవారంతా కుల ఆధారిత అంశాల కంటె పైకి ఎదిగిన వారే అని చెప్పారు.
‘‘భారతదేశ చరిత్ర, సంస్కృతి, నైతిక విలువల నుంచి సంఘ్ స్ఫూర్తి పొందుతుంది. గొప్పగొప్ప దేశభక్తులు అందరూ భారతదేశపు జాతీయతా భావాల నుంచి స్ఫూర్తి, ప్రేరణ పొందినవారే. వారందరూ స్వయంసేవకులు కాకపోయినా వారి త్యాగాలను సంఘ్ ఉదయ ప్రార్థనలో స్మరించుకుంటోంది. చార్ సాహిబ్‌జాదే నుంచి భగత్ సింగ్ వరకూ, మహారాణి అబ్బక్క నుంచి రాణీ లక్ష్మీబాయి వరకూ వారందరూ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వపు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఒక సమాజపు గొప్పవారు దాని నైతిక విలువలను పాటించగలిగితే ఆ సమాజంలో సమరసత సాధ్యమవుతుంది. ఆక్రమణదారుల నుంచి ఎవరైనా ప్రేరణ పొందితే, దాన్ని ఖండించాల్సిందే’’ అని చెప్పారు.
అక్రమ వలసల గురించి మాట్లాడుతూ… వలస వెళ్ళాలనుకునే వారు దానికి అవసరమైన పద్ధతులను సరిగ్గా అనుసరించాలన్నారు. భారతదేశంలోకి అక్రమ చొరబాట్ల వార్తలు చాలా ఉన్నాయనీ, ఆ విషయంలో కఠినమైన చట్టాలు, నియమాలూ రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనీ అభిప్రాయపడ్డారు.
ఆర్ఎస్ఎస్‌లో మహిళల భాగస్వామ్యం గురించి జవాబు చెబుతూ, సంఘ్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ మహిళలు క్రియాశీలంగా పాల్గొంటారని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేనిదే కుటుంబ ప్రబోధనం బలపడదన్నారు. కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో మాత్రమే కాదు, మొత్తంగా సమాజంలో ప్రతీ కార్యక్రమంలోనూ, నిర్ణయాలు తీసుకునే ప్రతీ ప్రక్రియలోనూ మహిళల ప్రమేయం ఉండడం తప్పనిసరి అని చెప్పారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను తప్పకుండా గుర్తించాల్సిందే అని హొసబళే చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల వార్షిక సమావేశం నేటితో ముగిసింది. ఆ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే, ఆరుగురు సహ సర్‌కార్యవాహలు, మిగతా కార్యనిర్వాహక సభ్యులు అందరూ పాల్గొన్నారు. ప్రాంత, క్షేత్ర స్థాయుల్లో ఎన్నికైన ప్రతినిధులు మొత్తం 1443 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పనిచేస్తున్న 32 సంస్థల అఖిల భారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.