రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం అఖిల భారతీయ ప్రతినిధి సభ 2025 నేటితో ముగిసింది. ఆ సందర్భంగా సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే ఈనాటి కార్యక్రమం వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఉధయం సమావేశం, ఇవాళ అమరవీరుల దినం సందర్భంగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు నివాళులు అర్పించడంతో మొదలైంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, వారిని స్వతంత్రం అనే బంధం కలిపింది.
మహారాణి అబ్బక్క 500 జయంతి సందర్భంగా ఆమెను భారతదేశపు గొప్ప మహిళా స్వతంత్ర యోధుల్లో ఒకరిగా కీర్తిస్తూ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే ఒక ప్రకటన విడుదల చేసారు.
‘‘ప్రతినిధి సభకు మొత్తం 1482మంది హాజరు కావలసి ఉంది, వారిలో 1443 మంది, అంటే 93.7శాతం మంది, హాజరయ్యారు. మణిపూర్, జమ్మూకశ్మీర్, కన్యాకుమారి సహా దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి స్వయంసేవకులు పాల్గొన్నారు. వారందరూసంఘంలో సేవ, శాఖ తదితర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు’’ అని హొసబళే చెప్పారు.
‘‘వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ పునరావాస కార్యకలాపాల్లో స్వయంసేవకుల కృషి గురించి సమావేశంలో చర్చించారు. సంఘం విస్తరణ గురించి చర్చలు జరిగాయి. వచ్చే మూడేళ్ళలో ప్రతీ మండలానికీ చేరుకోవాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం’’ అని చెప్పారు.
‘‘సంఘం ఎప్పుడూ వార్షికోత్సవాలు, రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలూ జరుపుకోలేదు. వేడుకల కంటె ఎక్కువగా తమ పనిని విస్తరింపజేయడం గురించే సంఘం ఆలోచించేది. అయితే ఇది శతజయంతి సంవత్సరం. అంతశ్శోధన చేసుకోడానికి, దేశ సేవలో అంకితభావంతో పనిచేయడానికి, సాధించిన విజయాలను గుర్తు చేసుకోడానికీ ఇదొక అవకాశం’’ అని హొసబళే వివరించారు. సంఘం శతజయంతి సందర్భంగా ప్రత్యేక తీర్మానం చేసారు.
‘‘ప్రపంచమంతా బాగుండాలి, మానవులంతా ఐకమత్యంగా ఉండాలి అనే లక్ష్యంతో హిందూ సమాజం అనాది కాలం నుంచీ సుదీర్ఘమైన, అద్భుతమైన ప్రయాణం చేస్తోంది. సాధుసంతుల ఆశీర్వచనాలతో, మహానుభావుల కృషితో, గొప్ప మహిళల ఆదరాభిమానాలతో మన దేశం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ముందుకు సాగిపోతోంది.
కాలక్రమంలో మన జాతీయ జీవనంలో చొరబడిన బలహీనతలను నిర్మూలించడానికి, భారతదేశాన్ని దాని పునర్వైభవపు పరాకాష్ఠకు చేర్చడానికీ, దేశాన్ని ఒక వ్యవస్థీకృతమైన ధార్మికమైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. సంఘ కార్యం అనే బీజాలు నాటే క్రమంలో డాక్టర్ హెడ్గేవార్ ప్రతీరోజూ శాఖ అనే రూపంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నిర్మాణ పద్ధతిని రూపొందించారు. మన ప్రాచీన సంప్రదాయ విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా దేశ పునర్నిర్మాణం కోసం చేసే నిస్వార్థమైన తపస్సుగా శాఖను తీర్చిదిద్దారు. శాశ్వతమైన తాత్వికత వెలుగులో జాతీయ జీవనంలోని పలు మార్గాల్లో సమకాలీనమైన, కాలానికి నిలబడగల వ్యవస్థలను నిర్మించే ప్రక్రియ రెండవ సర్‌సంఘచాలక్ పూజనీయ గురూజీ (మాధవ సదాశివ గోళ్వాల్కర్) దార్శనిక నేతృత్వంలో మొదలైంది.
ఈ నూరేళ్ళ ప్రయాణంలో, ప్రతీరోజూ శాఖలో అలవాటు చేసే విలువలతో, సంఘం పట్ల ఈ సమాజం అచంచలమైన విశ్వాసాన్నీ, ఆదరాభిమానాలనూ చూపించింది. ఈ కాలంలో స్వయంసేవకులు మానావమానాలు, ఇష్టాయిష్టాల వంటి వాటికి అతీతంగా ఎదిగారు, ప్రేమాభిమానాలతో ప్రతీ ఒక్కరినీ కలుపుకునిపోవాలని ప్రయత్నించారు. సంఘం శతజయంతి సందర్భంగా, సంఘానికి ఆశీస్సులు ఇచ్చి, సహకారం అందించి, అన్ని విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యస్థైర్యాలను అందించిన పూజ్య సాధువులను, సజ్జనులనూ స్మరించుకోవడం మన ధర్మం. తమ జీవితాలను సంఘానికే అంకితం చేసిన నిస్వార్థ స్వయంసేవకులనూ, సంఘం పట్ల పూర్తి విశ్వాసంతో నిమగ్నమైపోయిన స్వయంసేవకుల కుటుంబాలనూ స్మరించుకోవడం మన ధర్మం. భారతదేశం ఘనమైన సంప్రదాయాలు, ప్రాచీనమైన సంస్కృతి కలిగిన దేశంగా ఒక సామరస్యమైన ప్రపంచాన్ని సృష్టించగల ప్రయోగాత్మక జ్ఞానం కలిగి ఉంది. మన ఆలోచనలు మొత్తం మానవాళిని విభజన, విధ్వంసకర ధోరణలు నుంచి రక్షించగలవు, శాంతిని కలిగించగలవు, సజీవ-నిర్జీవ రాశులు అన్నీ ఒకటే అనే ఆలోచనా ధోరణిని కలిగించగలవు’’ అని ఆ తీర్మానం వివరించింది.
ఈ శత జయంతి సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయన తెలియజేసారు.
2025 అక్టోబర్ 2 విజయదశమి:
ఈ యేడాది మొదటి పెద్ద కార్యక్రమం విజయదశమి రోజు జరుగుతుంది. సంస్థ ప్రారంభించిన రోజయిన విజయదశమి నాడు స్వయంసేవకులను ఉద్దేశించి సర్‌సంఘచాలక్ ప్రసంగిస్తారు. ఆ రోజు దేశంలో ప్రతీ మండలంలోనూ శాఖలు నిర్వహించాలి. ఒక లక్ష శాఖలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. దేశంలో వీలైనన్ని ఎక్కువ బస్తీలకు, ఇళ్ళకూ సంఘాన్ని చేరువ చేయాలి.
సమాజ సమ్మేళనాలు, హిందూ సమ్మేళనాలు:
శక్తివంతమైన, వివక్షా రహితమైన, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సాధించే లక్ష్యంతో మండల స్థాయిలో ఈ సమ్మేళనాలు నిర్వహిస్తారు. పంచ పరివర్తనాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. వాటిని దైనందిన జీవితంలో ఎలా అమలు చేయాలనే విషయం గురించి మార్గదర్శకత్వం అందిస్తారు.
సామాజిక సద్భావ సమావేశాలు:
స్వయంసేవకుల కృషి ఫలితంగా సామాజిక ఐకమత్యం బలోపేతమైంది. సమాజం ఐకమత్యంగా ఉండడమే లక్ష్యం. ఈ సమావేశాలు ఆధ్యాత్మిక ఔన్నత్యం, సమన్వయం, యువతరానికి వ్యసనాల నుంచి స్వేచ్ఛ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి సారిస్తాయి.
కథన రీతులను మార్చేందుకు మేధోజీవులతో ‘ప్రముఖ జనగోష్ఠి’ పేరిట సమావేశాలు:
ఈ సమావేశాలు జాతీయ అంశాలపై దృష్టి సారిస్తాయి. ఎన్నోయేళ్ళుగా సమాజంలో తప్పుడు కథనాలు (ఫాల్స్ నెరేటివ్స్) ప్రచారంలో ఉన్నాయి, వాటిని మార్చవలసిన అవసరం ఉంది. చర్చల దిశలో మార్పు తీసుకురావాలి.
భాగవత్‌జీ మార్గదర్శనం:
డాక్టర్ మోహన్ భాగవత్‌జీ నాలుగు నగరాల్లో ప్రసంగాలు చేస్తారు. వాటి ద్వారా జాతీయ అంశాల విషయంలో కథన రీతి ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తారు.
శాఖల విస్తరణ ప్రణాళిక:
2025 సెప్టెంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకూ కాల వ్యవధిలో దేశంలో లక్షకు పైగా ప్రదేశాల్లో వారానికి ఒకసారి శాఖలు నిర్వహిస్తారు.
యువతరంతో భేటీలు (13-30ఏళ్ళ వయసు):
పంచ పరివర్తన్, సేవ, జాతీయ అభివృద్ధి వంటి అంశాలపై యువతరానికి, కళాశాల విద్యార్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భారతదేశాన్ని మళ్ళీ సమృద్ధం చేసే దిశగా సమాజానికి సేవలు అందించేలా ఆ కార్యక్రమాలు ఉంటాయి.