లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతోందంటూ గుండెలు బాదుకోవడంతో మొదలుపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. దానికి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు.
మరో పాతికేళ్ళ పాటు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టకూడదని ఆ అఖిల పక్షం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జనాభా నియంత్రణను సమర్ధంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఎంపీ సీట్ల పునర్విభజన శిక్షగా మారకూడదని ఆయా పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అందరితోనూ చర్చలు జరపాలి, అన్ని రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరై, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమ భావాలను వ్యక్తపరిచాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరు కాకపోవడం విశేషం. ఏపీలోని ప్రధాన పార్టీల్లో తెలుగుదేశం, జనసేన… ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వైఎస్ఆర్‌సిపి ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకమే ఐనా, జాతీయ పార్టీ అయిన బీజేపీతో సమదూరం పాటిస్తోందని చెప్పుకోవచ్చు. ఇటు స్నేహమూ లేదు, అటు శత్రుత్వమూ లేదు అన్నట్టుగా ఉంటోంది. ఇంక కాంగ్రెస్, వామపక్షాలకు రాష్ట్రంలో ఉనికే లేదు. విచిత్రంగా, బీజేపీకి అత్యంత సన్నిహితమైన పార్టీగా ముద్ర పడిన జనసేన ప్రతినిధి చెన్నైలో కనిపించడం చర్చకు దారి తీసింది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకూ డీలిమిటేషన్‌పై తన వైఖరిని ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడ మీడియా సమావేశంలో ఈ అంశంపై ప్రశ్న ఎదురైనప్పుడు తగిన సమయంలో స్పందిస్తామని తప్పించుకున్నారు. ఆయన ప్రస్తుతానికి నరేంద్ర మోదీ, అమిత్ షాలను కాదనే పరిస్థితి కానీ అవసరం కానీ లేవు. అలా అని శాశ్వతంగా అదే వైఖరి మీద ఉంటారా అన్నదీ చెప్పలేము. నిజంగా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యేటప్పటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో, దాన్నిబట్టి చంద్రబాబు నిర్ణయం ఉండవచ్చు. అంతవరకూ ‘పొలిటికల్లీ కరెక్ట్’ ప్రకటనలతో కథ నడిపించేస్తారు. ఆ విషయంలో బీజేపీ, డీఎంకేలకు కూడా కచ్చితమైన స్పష్టత ఉంది.
జనసేన పార్టీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. ఆ పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ శుక్రవారం రాత్రికి ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. డీఎంకే ఎంపీలు పి విల్సన్, ఎంఎం అబ్దుల్లా చెన్నై విమానాశ్రయంలోనే ఉదయ్‌కు స్వాగతం పలికారు. శనివారం సమావేశ వేదిక అయిన ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లోనే ఉదయ్‌కు బస ఏర్పాటు చేసారు. అక్కడే అన్నిపార్టీల ప్రతినిధులూ ఉండడం, శనివారం ఉదయం అక్కడే సమావేశం జరగడమూ గమనార్హం. దాంతో జనసేన ఎంపీ అక్కడ ఏం చేస్తున్నారు అన్న సందేహాలు తలెత్తాయి.
ఇటీవలే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమయంలో పవన్ కళ్యాణ్ ఘాటుగా చేసిన ప్రసంగంలో పరోక్షంగా డీఎంకే నాయకులపై విసుర్లు విసిరారు. త్రిభాషా సూత్రం ద్వారా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ డీఎంకే చేసిన ఆరోపణల మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆ సందర్భంలో ఆయన మాటలు డీఎంకేను తప్పు పట్టినట్లుగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు కూడా హిందీ విషయంలో డీఎంకే మీద అంతగా చెలరేగిపోలేదు. ఇంక, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న డీఎంకే విధానానికీ, సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ విధానాలకూ చుక్కెదురే. ఐతే, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మాత్రం వారిద్దరూ ఏకీభవించారా? డీఎంకే ఏర్పాటు చేసిన సమావేశానికి ఉదయ్ శ్రీనివాస్ హాజరై ఉంటే ఆ విషయం స్పష్టమయ్యేది. తెర వెనుక ఏం జరిగిందో తెలీదు కానీ, శనివారం ఉదయమే ఉదయ్ శ్రీనివాస్ చెన్నై నుంచి బయల్దేరి వెనక్కు వెళ్ళిపోయారు.
శనివారం సాయంత్రం జనసేన నుంచి ఒక ప్రకటన వచ్చింది. ‘‘చెన్నైలో డిఎంకె పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరఫున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాము’’ అని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. నిజానికి, సమావేశానికి హాజరు కాబోము అని చెప్పడానికి సమావేశం వేదిక దగ్గరకు వెళ్ళి చెప్పవలసిన అవసరం ఏముంది అన్నది ప్రశ్న.
మరో ఆంధ్రా పార్టీ వైఎస్ఆర్‌సిపి కూడా ఆ సమావేశానికి హాజరు కాకపోయినా, తమ సందేశాన్ని పంపించింది. పార్టీ అధినేత జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి, దాని ప్రతిని డీఎంకేకు అందజేసారు. నియోజకవర్గాల పునర్విభజనపై పలు ఆందోళనలు, భయాలు ఉన్నాయనీ, వాటిని నివృత్తి చేయవలసిన అవసరం ఉందనీ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దామాషా ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతుందని చెప్పినందుకు ఆయనకు జగన్ ధన్యవాదాలు తెలియజేసారు. అయితే దానికి రాజ్యాంగబద్ధత ఉండాలని సూచించారు. దామాషా ప్రకారం ప్రతీ రాష్ట్రానికీ సీట్ల కేటాయింపు మీద రాజ్యాంగ సవరణ చేయాలని, అప్పుడే రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అనుమానాలు తొలగిపోతాయనీ అభిప్రాయపడ్డారు.
నిజానికి జగన్‌కు స్టాలిన్‌తో మంచి స్నేహమే ఉండేది. 2019లో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు స్టాలిన్ అతిథిగా హాజరవడం విశేషం. అయితే అదే సమయంలో కేంద్రంలో ఎన్డీయే కూటమి మరింత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ బీజేపీతో సామరస్య ధోరణితో వ్యవహరించడం మొదలుపెట్టారు. వ్యక్తిగత, రాజకీయ అవసరాల దృష్ట్యా జగన్ బీజేపీతో రాజీ ధోరణిలో ఉండేవారన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పుడు 2025 ఎన్నికల్లో తమ పార్టీ దారుణ ఓటమి తర్వాత, కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… ఆ పార్టీ మీద డీఎంకే అంత అగ్రెసివ్‌గా విరుచుకుపడే పరిస్థితి జగన్‌కు లేదు. పైగా, జగన్‌కు కాంగ్రెస్ మీద ఉన్నంత వ్యతిరేకత బీజేపీ మీద లేదు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నమాట వాస్తవమే. కానీ జగన్ పార్టీ టీడీపీ, జనసేనలతో ఉండేంత కఠినంగా బీజేపీతో లేదన్నది కళ్ళముందరి వాస్తవం. అందుకే డీలిమిటేషన్ విషయంలో జగన్ పార్టీ, ‘తమలపాకుతో నేనొకటంటా’ అన్నట్లు సుతిమెత్తగా ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’లా సుమతీశతకం వల్లె వేసింది.
డీఎంకే సమావేశానికి ఒక తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అధికార, ప్రతిపక్షాలు రెండూ కలిసి హాజరైతే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార, ప్రతిపక్షాలు రెండూ డుమ్మా కొట్టడం విశేషం. ఆంధ్రాలో ఉన్న పార్టీల్లో బీజేపీ కేంద్ర నాయకత్వానికి అతిదగ్గరగా ఉండే పార్టీ అన్న ముద్ర పడిన జనసేన మాత్రం డీఎంకే సమావేశానికి హాజరయ్యీ అవనట్టు మెరుపులా తళుక్కుమని మెరవడం గమనార్హం.