రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. హమాస్ ముఖ్యనేతలే లక్ష్యంగా ఐడీఎఫ్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. తాజాగా ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో హమాస్ రాజకీయ కమిటీ సభ్యుడు సలాల్ అల్ బర్దావీల్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హమాస్ స్వయంగా ప్రకటించింది.
వారం రోజులుగా ఇజ్రాయెల్ 40కుపైగా ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో 700 మందికిపైగా హతమయ్యారు. శనివారం జరిపిన దాడిలో హమాస్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది.
రెండో విడత కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలలో హమాస్ ఉగ్రవాదులు ముందుకు రాకపోవడంతో ఇజ్రాయెల్ దాడులు పెంచింది. పాలస్తీనా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.