లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న పద్ధతిలో జనాభా ఆధారంగా నియోజక వర్గాలను పునర్విభజన చేస్తారు. అదే జరిగితే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దానివల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనలో దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆరోపణలు చేసారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామంటూ వ్యాఖ్యలు చేసారు. దక్షిణాది ప్రజా ప్రతినిధుల అంగీకారం లేకుండానే చట్టాలు తయారవుతాయని, వాటిని దక్షిణాది రాష్ట్రాల ప్రజల మీద రుద్దుతారనీ ఆరోపించారు.
డీలిమిటేషన్ జరిగితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోతాయని, వాటికోసం పోరాటాలు చేయాల్సి వస్తుందనీ భయపెట్టారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందంటూ తప్పుడు ఆరోపణలు చేసారు. ఉత్తరాది ప్రాబల్యం వల్ల దక్షిణాది రాష్ట్రాల విద్యార్ధులు అవకాశాలు కోల్పోతారు. రైతులకు ఎలాంటి మద్దతూ ఉండదు. మన సంప్రదాయాలు, మన అభివృద్ధికి ప్రమాదం వాటిల్లుతుంది అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
అలా అని తాము లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనకు వ్యతిరేకం కాదంటూ స్టాలిన్ సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. డీలిమిటేషన్ అనేది న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలని మాత్రమే తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు.
లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో… ఎన్డీయే ప్రభుత్వం చేపట్టే డీలిమిటేషన్ దక్షిణాదికి వ్యతిరేకంగా ఉంటుందని ఊహించుకుంటున్న డీఎంకే, ఆ విషయాన్ని పెద్దగా ప్రచారం చేసింది. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ చెన్నైలో జరిగిన ఆ సమావేశంలో స్టాలిన్ ఆ విధంగా మాట్లాడారు.
డీఎంకే తరఫున ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్, ఒడిషా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, బీజేడీ నాయకుడు సంజయ్ కుమార్ దాస్ బర్మా తదితరులు పాల్గొన్నారు.