బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా ఇస్లామిక్ అతివాదులు హిందువులు, ఇతర మైనారిటీలపై పాల్పడుతున్న అపరిమిత హింసాకాండ విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం, ప్రపంచ దేశాల్లోని హిందువులూ కలిసికట్టుగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు అండగా నిలవాలని కోరింది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టాలనీ, అక్కడ ముస్లిమేతర ప్రజలు సైతం ప్రశాంతంగా బతకడానికి వీలు కల్పించేలా ప్రయత్నించాలనీ కోరింది. బెంగళూరులో జరుగుతున్న సంఘ్ వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్’లో ఆ మేరకు తీర్మానం చేసింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్‌లో బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన తీర్మానం ఇలా ఉంది….
‘‘బంగ్లాదేశ్‌లో అతివాద ఇస్లామిక్ శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న నిరంతరమైన, ప్రణాళికాబద్ధమైన హింసాకాండ, అన్యాయాలు, అణచివేత విషయమై అఖిల భారతీయ ప్రతినిధి సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది స్పష్టంగా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనే.
బంగ్లాదేశ్‌లో ఇటీవల అధికార మార్పిడి సమయంలో మఠాలు, దేవాలయాలు, దుర్గాపూజ మండపాలు, విద్యా సంస్థలపై దాడులు, దేవతామూర్తుల ధ్వంసం, అనాగరిక హత్యలు, ఆస్తుల దోపిడీలు, మహిళల అపహరణలు, వేధింపులు, బలవంతపు మతమార్పిడుల వంటి అనేక సంఘటనలు నిరంతరం వెలుగు చూస్తున్నాయి. ఆ సంఘటనలను కేవలం రాజకీయ సంఘటనలని పేర్కొంటూ వాటి మతపరమైన కోణాన్ని తిరస్కరించడం సత్యాన్ని తిరస్కరించడమే. ఆ సంఘటనల బాధితులు దాదాపు అందరూ హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారే.
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మతోన్మాద ముస్లిం శక్తుల చేతుల్లో హింసకు గురవుతుండడం కొత్తేమీ కాదు. బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా 1951లో 22 శాతం నుంచి నేడు 7.95 శాతానికి తగ్గిపోవడం వారి ఉనికే సంక్షోభంలో ఉందనడానికి నిదర్శనం. అయితే, గత సంవత్సరం చోటుచేసుకున్న హింసా ద్వేషాలకు అక్కడి మధ్యంతర ప్రభుత్వం అందిస్తున్న సంస్థాగత మద్దతు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. దానితో పాటు, బంగ్లాదేశ్‌లో నిరంతరం భారత వ్యతిరేక ప్రచారం రెండు దేశాల సంబంధాలనూ దెబ్బతీస్తోంది.
కొన్ని అంతర్జాతీయ శక్తులు భారత్ చుట్టూ ఉన్న ప్రాంతం అంతటా అస్థిరతను రేకెత్తించడానికి సంఘటిత ప్రయత్నం చేస్తున్నాయి. ఆ చర్యలు పొరుగు దేశాల మధ్య అపనమ్మకాన్ని, ఘర్షణ వాతావరణాన్నీ సృష్టిస్తున్నాయి. అలాంటి భారత వ్యతిరేక వాతావరణం, పాకిస్తాన్ కార్యకలాపాలు, డీప్ స్టేట్ చర్యల విషయంలో అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అప్రమత్తంగా ఉండాలి, వాటిని బహిర్గతం చేయాలి. భారత ఉపఖండ దేశాలన్నీ ఉమ్మడి సంస్కృతి, చరిత్ర, సామాజిక బంధాలను కలిగి ఉన్నాయి. అందుకే ఒకచోట కలిగే సమస్య మొత్తం ప్రాంతమంతా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి భారత్, దాని పొరుగు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేయాలి.
ఈ మొత్తం వ్యవహారంలో గుర్తించవలసిన విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం ఆ దురాగతాలను శాంతియుతంగా, సమష్టిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో, ధైర్యంగా ప్రతిఘటించింది. వారి సంకల్పానికి భారత్ సహా ప్రపంచ దేశాల్లోని హిందూ సమాజం నుంచి నైతిక, మానసిక మద్దతు లభించడం ప్రశంసనీయం. భారత్ సహా వివిధ దేశాలలోని వివిధ హిందూ సంస్థలు ఈ హింసకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసాయి. ప్రదర్శనలు, పిటిషన్ల ద్వారా బంగ్లాదేశ్ హిందువుల భద్రత, గౌరవం కోసం డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ సమాజం నుండి అనేక మంది నాయకులు కూడా ఈ అంశాన్ని తమ స్థాయిలో లేవనెత్తారు.
బంగ్లాదేశ్‌లోని హిందూ మరియు ఇతర మైనారిటీ వర్గాలకు మద్దతుగా నిలబడాలని మరియు వారి రక్షణ అవసరమని భారత ప్రభుత్వం తన సంకల్పాన్ని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో పాటు అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తావించింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజపు భద్రత, రక్షణ, గౌరవం, శ్రేయస్సును నిర్ధారించడానికి భారతదేశం సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేయాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అర్థవంతమైన సంభాషణలను నిరంతరం కొనసాగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న అమానవీయ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి, ఆ హింసాత్మక కార్యకలాపాలను నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ సమాజంపై ఉంది. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలకు సంఘీభావంగా గళమెత్తాలని వివిధ దేశాలలోని హిందూ సమాజాలు, హిందూ నాయకులు, ఇంకా అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది.’’