కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న విధానాల వల్ల ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రసూతి మరణాలను తగ్గించడంతో పాటు మహిళలకు సురక్షితమైన మాతృత్వంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తున్నామన్నారు. 2014-16 మధ్యకాలంలో లక్ష శిశు జననాలకు 130 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. అది 2018-20 నాటికి 97కి తగ్గించ గలిగామన్నారు.
2030 నాటికి ప్రసూతి మరణాల రేటు లక్షకు 70 కన్నా తక్కువ సాధించాలన్న సహస్రాబ్ది లక్ష్యం సాధిస్తామని మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహరాష్ట్ర, తెలంగాణా సహా ఏడు రాష్ట్రాలు ఇప్పటికే లక్ష్యం సాధించాయని మంత్రి గుర్తుచేశారు.