మతపరమైన గ్రంథాలు కాల్చి వేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో మార్చి 17న నాగపూర్ నగరంలో హింస చెలరేగింది. దీని వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. త్వరలో స్పష్టత వస్తుందని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ చెప్పారు. హింస వెనుక ఎవరున్నా వదిలేది లేదన్నారు. నాగపూర్ అల్లర్లలో జరిగిన నష్టాన్ని, హింసకు పాల్పడిన వారి నుంచి వసూలు చేస్తామన్నారు. చెల్లించని వారి ఆస్తులు వేలం వేస్తామని సీఎం హెచ్చరించారు.
నాగపూర్ హింసకు కారణంగా భావిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. బంగ్లాదేశ్ హస్తం ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలను తొలగించారు. బాధ్యులను అరెస్ట్ చేశారు.
నాగపూర్ హింసపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో సీఎం ఫడణవీస్ సమీక్ష నిర్వహించారు. హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించారు.