జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాబోయే మూడు నెలల్లో రైతుల పొలాల్లో లక్షన్నర నీటి కుంటలు తవ్విస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పూడిచర్లలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి కుంటల తవ్వకానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలను పెంచడంతోపాటు, 90 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన గుర్తుచేశారు.
వర్షాలు రాగానే పంట కుంటలు నీటితో నిండేలా ప్రణాళిక సిద్దం చేశారు. కుంటల్లోని వర్షపు నీరు చేరడం, నిండగానే నీరు వెళ్లిపోయే విధంగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద రూ.9597 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు. పేద ప్రజలకు ఉపాధి హమీ పథకం వరంలాంటిదన్నారు. వంద మందికిపైగా నివసిస్తున్న అన్ని మారుమూల గ్రామాలకు ఈ పథకం ద్వారా రోడ్లు నిర్మించినట్లు చెప్పారు.