హిందూధార్మికులు ఆసక్తిగా ఎదురుచూసే చార్‌ధామ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర మొదలవుతుంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర క్షేత్రాలను ఏప్రిల్ 30న తెరుస్తారు. కేదారనాథ్ క్షేత్రాన్ని మే 2న, బదరీనాథ్ క్షేత్రాన్ని మే 4న తెరుస్తారు. హేమకుండ్ సాహెబ్ కూడా భక్తుల కోసం మే 25 నుంచీ తెరవబడుతుంది. హిమాలయ సానువుల్లోని ఆ అపురూప పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తరించాలని హిందువులు భావిస్తుంటారు. అందుకే చార్‌ధామ్ యాత్రకు అంత ప్రత్యేకత.
ప్రతీయేటా వేలాది యాత్రికులు చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోడానికి తహతహలాడుతుంటారు. హిమాలయాల్లో నెలవైన ఆ నాలుగు పుణ్యక్షేత్రాలనూ క్షేమంగా చూసి రావడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్ర్రక్రియను తప్పనిసరి చేసింది. యాత్రికుల భద్రత, సాఫీగా ప్రయాణం, పుణ్యక్షేత్రాల్లో ఎక్కువ మంది ఒకేసారి గుంపుగా గుమిగూడకుండా నిలువరించడం కోసం ప్రభుత్వం ఈ యేర్పాటు చేసింది.
చార్‌ధామ్ యాత్ర కేవలం నాలుగు దేవాలయాల దర్శనం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కోసం అంతరంగంలోకి చేసే ప్రయాణానికి ప్రతీక, మోక్షాన్ని సాధించడం కోసం చేసే తపస్సుకు చిహ్నం. ఈ యాత్రలో భక్తులు ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అవి…
(1) యమునోత్రి: యమునా నది జన్మించిన ప్రదేశం, యమునా మాతకు అంకితం చేసిన క్షేత్రం
(2) గంగోత్రి: గంగా నది జన్మించిన ప్రదేశం, గంగా మాతకు అంకితం చేసిన క్షేత్రం
(3) కేదారనాథ్: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి, పరమశివ భగవానుడి క్షేత్రం
(4) బదరీనాథ్: చార్‌ధామ్‌లో ఆఖరుది, విష్ణుమూర్తి బదరీ నారాయణుడిగా పూజలు అందుకునే క్షేత్రం
సనాతన ధార్మికుల విశ్వాసం ప్రకారం ఈ యాత్ర మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఆధ్యాత్మిక అభ్యున్నతికి తోడ్పడుతుంది. జీవన్మరణాల చక్రం నుంచి విముక్తం చేసి మోక్షం దిశగా నడుపుతుంది.
చార్‌ధామ్ సందర్శన కోసం భారీగా వచ్చిపడే భక్తులను నియంత్రించడానికి ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్, యాత్రికుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. భక్తులు registrationandtouristcare.uk.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దేవాలయాల్లో ప్రవేశానికి ఆలయం దగ్గర దర్శనం టోకెన్ తీసుకోవాలి.
యాత్రికులకు ముఖ్యమైన మార్గదర్శకాలు:
— యాత్ర అప్‌డేట్స్ కోసం సరైన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి
— చెక్‌పోస్టుల దగ్గర సమస్యలు తలెత్తకుండా కచ్చితమైన సమాచారాన్ని పొందుపరచండి
— సీనియర్ సిటిజన్లకు ప్రయాణం ప్రారంభంలో ఆరోగ్య పరీక్ష తప్పనిసరి
— హెలికాప్టర్ టికెట్లను heliyatra.irctc.co.in వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి
ట్రాఫిక్ రద్దీ, నిర్వహణ లోపాలను అధిగమించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు కొత్త చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. కటాపత్థర్, హెర్బెర్ట్‌పూర్ బస్టాండ్ దగ్గర యాత్రికుల వాహనాలను తనిఖీ చేసి నియంత్రిస్తారు.
చార్‌ధామ్ యాత్రలో ప్రయాణికులు ఎదుర్కొనే సవాళ్ళు….
— సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున ట్రెక్కింగ్
— ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి
— అనూహ్య వాతావరణం (హిమపాతం, కొండచరియలు విరిగిపడడం, అసాధారణమైన చలి)
— ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వంటి సమస్యలు (తలనొప్పి, నాజియా, తలతిరుగుడు, వాంతులు)
సురక్షిత ప్రయాణానికి ఏం కావాలంటే….
— యాత్ర ప్రారంభానికి ముందు మెడికల్ చెకప్
— చలిని తట్టుకోడానికి వార్మ్ లేయర్స్, రెయిన్‌కోట్లు, ట్రెక్కింగ్ షూస్, అత్యవసర మందులు
— బాగా మంచినీళ్ళు తాగాలి, తేలికపాటి ఆహారం తినాలి, అందుబాటులో ఎనర్జీ బార్స్ ఉండాలి
— ప్రయాణానికి ముందు వాతావరణం అప్‌డేట్స్ చూసుకోవాలి
గతేడాది కటాపత్థర్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా అల్లకల్లోలం జరిగింది. భక్తులు తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలూ లేకుండా గంటల తరబడి ఉండాల్సి వచ్చింది. అలాంటి సమస్యలను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం కొన్ని ఏర్పాట్లు చేసింది…
— హెర్బర్ట్‌పూర్ బస్టాండ్ దగ్గర కొత్త స్టాపేజ్ సెంటర్, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారు
— ఆన్‌లైన్ వ్యవస్థ ఓవర్‌లోడ్‌ను తగ్గించడానికి హెర్బర్ట్‌పూర్‌లో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేసారు
— చిక్కుకుపోయిన వారికి సహకరించేందుకు ఆహార, విహారాల సౌకర్యాల కల్పన సర్దుబాట్లు ఉంటాయి
ఏఆర్‌టీఓ నిర్వాహక అధికారి (ఎఆర్‌టిఒ) నిర్వాహకుడు మనీష్ తివారీ ఈవిధంగా చెప్పారు. ‘‘కటాపత్థర్ హైవే చాలా సన్నగా ఉంటుంది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవు. హెర్బర్ట్‌పూర్ దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడం వల్ల గతేడాది తలెత్తిన చిక్కులను తగ్గించుకోవచ్చు, భక్తులకు మెరుగైన అనుభూతిని కలిగించవచ్చు.’’
మరిన్ని వివరాలకు, అత్యవసర పరిస్థితుల్లోనూ భక్తులు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్లు….
— టోల్ ఫ్రీ నెంబర్ 0135-1364
— ఫోన్ నెంబర్లు 0135-2559898, 0135-2552627