‘విజన్ 2047, AI, అందరికంటే ముందుండాలి.. ముందుచూపు ఉండాలి’… ఈ మాటలు తరచుగా ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటారు. ప్రతీ బహిరంగసమావేశంలో ఈ విషయాలను ఆయన పదేపదే ప్రస్తావిస్తారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజలకు సేవలందించడంలో టెక్నాలజీని ఉపయోగించి వేగంగా స్పందించాలని అధికారులకు హితబోధ చేస్తుంటారు. కానీ అందుకు తగ్గ వేగం, కార్యాచరణ ప్రభుత్వ అధికార యంత్రాంగం వద్ద ఉందా అనే అవును అనే సమాధానం టక్కున చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లక్షా 32 వేల 395 ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని 38 సచివాలయ శాఖల్లో ఈ ఫైళ్ళు క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ విషయాన్ని ‘ ఈ–ఆఫీస్’లో ఫైళ్ల క్లియరెన్స్‌ను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్ లో ఉండగా , సీఎం దగ్గరున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పేరుకుపోయాయి.
సీఎస్ ఆఫీసులో అత్యల్పంగా 42 ఫైళ్ళు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక రోజు సమయం తీసుకుంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేసేందుకు రెండు రోజులు సమయం తీసుకుంటున్నాయి.
ఒక్కో ఫైలు క్లియరెన్స్ కు న్యాయ శాఖ సగటున మూడు రోజులు తీసుకుంటుండగా రెవెన్యూ శాఖలో ఐదు రోజులు సమయం పడుతోంది. జలవనరుల శాఖలో మాత్రం సుమారు నెలన్నర పడుతుంది. విపత్తుల శాఖ పరిస్థితి ఇదే రకంగా ఉంది.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అవీ ముందుకు కదలని పరిస్థితి.
రెవెన్యూ శాఖలో 11,286, జలవనరుల శాఖలో 9,491, హోం శాఖలో 7,433, ఆర్థిక శాఖలో 7,013 ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. ఇక పరిశ్రమలు వాణిజ్య శాఖ వద్ద 6,151 ఫైళ్ళు పేరుకుపోయాయి.