భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విత్తన విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఖరీఫ్ 2025 జోనల్ విత్తన సమీక్ష సమావేశం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో గురు, శుక్ర వారాలు రెండు రోజుల పాటు జరిగిన ఆ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యవసాయ శాఖాధిపతులూ పాల్గొన్నారు. జాతీయ స్థాయి ప్రభుత్వ, ప్రభుత్వరంగ విత్తన పరిశోధనా సంస్థలు, సరఫరా సంస్థలతో సమావేశమయ్యారు.
మొదటి రోజు ఖరీఫ్ 2025 సీజన్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ప్రతిపాదించిన విత్తన రకాల ఎంపిక, వాటి లభ్యత, సరఫరా అంశంపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ విత్తనోత్పత్తి పధకం, రైతు స్థాయిలో ధ్రువీకరణ విత్తనాల విత్తనోత్పత్తి తదితర అంశాలపై చర్చించారు. రెండవ రోజు జరిగిన సదస్సులో ప్రతిష్ఠాత్మక పరిశోధనా క్షేత్రాలు, సంస్థల ద్వారా కొత్తగా విడుదలైన అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నోటిఫైడ్ రకాల విత్తనాల లక్షణాలు, వాటి దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే అంశాలను వివరించారు.
బ్రీడర్ విత్తనాల ప్రాముఖ్యతను తెలుపుతూ రైతులే వారి క్షేత్రాలలో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకునేలా… వేరుశనగ, వరి, కంది, పెసర, మినుము, రాగి, సజ్జ అనే ఏడు పంటల బ్రీడర్ విత్తనాలకు రాయితీ కల్పిస్తున్నామని వివరించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీఫ్ సీజన్ 2026 నుండి బ్రీడర్ విత్తనం సాగు నుండి తరువాతి సీజన్‌కు మూల విత్తనంగానూ, వాటి నుండి తదుపరి సీజన్‌కు ధ్రువీకరించిన విత్తనంగానూ ప్రత్యుత్పత్తి చేసుకుంటూ 2027-28 సంవత్సరానికల్లా రైతు స్థాయిలోనే నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసుకునేలా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలకు అనుగుణముగా బ్రీడర్ విత్తనాలను రాయితీపై సరఫరాకు అనుమతి ఇచ్చామని సమావేశం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంచాలకుల తరఫున పాల్గొన్న విత్తన సంయుక్త సంచాలకులు కృపదాస్ మాట్లాడుతూ… ఆ సమావేశములో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు 7 పంటలకు 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాలను రాయితీపై సరఫరా చేయడానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేసారు. వాటి సరఫరా ద్వారా 2027 -28 సంవత్సరానికి, అంటే మూడవ సీజన్‌కు, నాణ్యమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా ఆ పంటలలో ఎటువంటి కొరత రాకుండా 3,35,720 క్వింటాళ్ల ధ్రువీకరణ విత్తనాలను ముందస్తు వ్యూహం, ప్రణాళికతో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఆ సమావేశానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన విత్తనాల విభాగం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ, ఐఏఎస్, నేతృత్వం వహించారు. విత్తనాల విభాగం సహాయ కమిషనర్ మరియు ఐకార్ అదనపు డైరెక్టర్ జనరల్ చందర్ మోహన్ పాల్గొన్నారు.