రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశాలు ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్’ శుక్రవారం నాడు బెంగళూరులో ప్రారంభమైంది. ఆ సమావేశాలు శుక్ర, శని, ఆది వారాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. భారతమాతకు పుష్పాంజలి ఘటించడంతో సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్` మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే ఆ సమావేశాలను ప్రారంభించారు.
మొదటగా గత యేడాది మనను విడిచి వెళ్ళిపోయిన మహనీయులకు నివాళులు అర్పించారు. కొల్లాంకు చెందిన స్వామి ప్రణవానంద, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాదకుడు జాకీర్ హుసేన్, సామాజిక కార్యకర్త వాసుదేవ్ నయ్యర్, దర్శకుడు శ్యామ్ బెనెగల్, కవి ప్రీతీష్ నంది, సీనియర్ రాజకీయ నాయకుడు ఎస్ఎం కృష్ణ, రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్, సంఘ్ సీనియర్ ప్రచారక్ శంకర్ తత్వవాది, ఆర్థికవేత్త బిబేక్ దేబ్‌రాయ్ (వివేక్ దేవరాయ్) తదితరులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆ తర్వాత, గతేడాది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల వార్షిక నివేదికను సమర్పించారు.
కార్యక్రమం ప్రారంభం తర్వాత సంఘ్ సహ సర్‌కార్యవాహ ముకుంద సిఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1482మంది సమావేశానికి హాజరయ్యారు, వారు తమ ప్రాంతాల్లో జరిగిన కార్యాల గురించి నివేదికలు సమర్పిస్తారని ముకుంద చెప్పారు. ‘‘గత యేడాది కాలంలో 51,710 సంఘ శాఖలు రోజూ సమావేశం అయ్యాయి, 21,936 శాఖలు వారానికి ఓసారి సమావేశమయ్యాయి. అనుదిన శాఖల సంఖ్య గతేడాది కంటె పదివేలు అధికంగా పెరిగి 83,129కి చేరుకున్నాయి. వారానికోసారి నిర్వహించే శాఖలు గతేడాది కంటె నాలుగు వేలు అధికంగా పెరిగి 32,147కు చేరుకున్నాయి. మొత్తం మీద అన్నిరకాలూ కలిపి 115,276 శాఖలు జరిగాయి’’ అని వివరించారు.
సంఘం గ్రామీణ ప్రాంతాల మీద కూడా దృష్టి సారిస్తోంది. మొత్తం 58,981 గ్రామీణ మండలాల్లో 30,770 చోట్ల అనుదినం శాఖలు జరుగుతున్నాయి. గతేడాది కంటె ఈ సంఖ్య 3,050 ఎక్కువ. వారానికి ఒకసారి జరిపే శాఖలు 9200కు పెరిగాయి. మొత్తంగా గ్రామీణ శాఖల సంఖ్య 39,970కి పెరిగింది’’ అని చెప్పారు.
‘‘సంఘం శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని 2453మంది స్వయంసేవకులు తమ ఇళ్ళను వదిలిపెట్టి రెండేళ్ళుగా విస్తారకులుగా పనిచేస్తున్నారు. ఈ యేడాది సంఘం వందేళ్ళు పూర్తిచేసుకుంటోంది. అది అతిపెద్ద వేడుక. సంఘాన్ని విస్తరించడానికి, బలోపేతం చేయడానికీ అది మంచి తరుణం’’ అని చెప్పారు.
గత యేడాది కాలంలో 4415 ప్రారంభిక్ వర్గలు నిర్వహించారు. వాటిలో 222,962మంది కొత్త స్వయంసేవకులు ఉన్నారు. వారిలో లక్షా 63వేల మంది 25-40 ఏళ్ళ గ్రూపులో ఉన్నారు. 20వేల మంది 40ఏళ్ళు పైబడిన వారున్నారు. వారు కాక 2012లో మొదలుపెట్టిన ‘జాయిన్ ఆరెస్సెస్’ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకూ 12,73,453 మంది సంఘంలో చేరారు. వారిలో 46వేల మంది మహిళలు ఉండడం విశేషం.
గత ఏడాది కాలంలో సంఘం కార్యక్రమాల గురించి దత్తాత్రేయ హొసబళే వార్షిక నివేదిక సమర్పించారు. సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశవ్యాప్త పర్యటనలు సహా ఆ యేడాది వ్యవధిలో సంఘంలో చేపట్టిన ప్రధానమైన కార్యక్రమాల గురించి నివేదికలో వివరించారు. ఇస్కాన్, చిన్మయ మిషన్, బిఎపిఎస్ వంటి అంతర్జాతీయ హిందూ సంస్థలతో సైతం సమావేశాలు జరిగాయి. వాటిలో, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఏమిటి, మిగత ప్రపంచంలో హిందువులకు సంబంధించిన విషయాలు ఏమిటన్న అంశాలపై వారితో చర్చలు జరిగాయి. దత్తాత్రేయ హొసబళేజీ కన్యాకుమారిలో సేవాభారతి నిర్వహించిన ‘కర్మయోగినీ సంగమం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి స్వయంసహాయక బృందాల్లో ఉన్న 60వేల మందికి పైగా మహిళలు హాజరవడం విశేషం.
ఆర్ఎస్ఎస్ సేవావిభాగం పనితీరును చూస్తే గతేడాది సంఘం 89,706 సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. వాటిలో విద్యకు సంబంధించినవి 40,920 ఉండగా, వైద్య సహాయానికి సంబంధించిన కార్యక్రమాలు 17,461 ఉన్నాయి. స్వయం సమృద్ధికి (ఆత్మ నిర్భరత) చెందినవి 10,779 ఉంటే సామాజిక అవగాహనా కార్యక్రమాలు 20,546 ఉన్నాయి. అవి కాక గో సంరక్షణ, గ్రామీణ వికాసం వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా సంఘం నిర్వహిస్తోంది.
సంఘ స్వయంసేవకులు సామాజిక సమరసత మీద ప్రత్యేక దృష్టి సారించారు. సామాజిక రుగ్మతలను తొలగించేందుకు 1084 ప్రదేశాల్లో పనులు చేసారు. తాగునీరు, దేవాలయ ప్రవేశం వంటి అంశాల పైనా ఇంకా పనిచేస్తున్నారు.
ఆర్‌ఎస్ఎస్ సహ సర్‌కార్యవాహ ముకుంద సిఆర్, మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికీ అభినందనలు తెలియజేసారు. ప్రతినిధి సభలో రాణి అబ్బక్క 500వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ప్రకటన విడుదల చేస్తారు.
ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే, ఆరుగురు సహసర్‌కార్యవాహలు, ప్రాంత-క్షేత్ర స్థాయుల్లో 1500మంది కార్యకర్తలు అందరూ ఈ వార్షిక సమావేశంలో పాల్గొంటున్నారు. సంఘం నుంచి ప్రేరణ పొంది ఏర్పాటైన 32 సంస్థల అఖిల భారత అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, నిర్వాహక కార్యదర్శి స్థాయి వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ గతేడాది కాలంలో పుణ్యశ్లోకీ ‘రాణి అహిల్యాబాయి’ 300వ జయంతి ఉత్సవాలు నిర్వహించింది.
మణిపూర్ పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు సిఆర్ ముకుంద జవాబిచ్చారు. ‘‘మణిపూర్‌లో గత 20 నెలలుగా పరిస్థితి అశాంతిగా ఉంది. రెండు వర్గాల మధ్య అపనమ్మకాల కారణంగా హింసాకాండ పెచ్చుమీరిపోయింది. ఇటీవలి రాజకీయ, కార్యనిర్వాహక చర్యల వల్ల కొద్దికాలంలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశ కలిగింది. మెయితీ, కుకీ తెగల మధ్య చర్చల కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోంది. రెండు తెగల నాయకులూ ఆర్ఎస్ఎస్‌తో మాట్లాడుతున్నారు. ఢిల్లీ, ఇంఫాల్‌లో చర్చలు కూడా జరిగాయి’’ అని చెప్పారు.
‘‘ఉత్తరాది-దక్షిణాది అన్న విభజన కూడా రాజకీయ ప్రేరేపితమే అని సంఘం భావిస్తోంది. అటువంటి సామాజిక విషయాలను సామాజిక నాయకులే పరిష్కరించాలి. భాషా పరమైన విభేదాలు జాతి సమైక్యతకు గొడ్డలిపెట్టు అని సంఘం విశ్వసిస్తుంది’’ అని సిఆర్ ముకుంద వివరించారు.
నియోజకవర్గాల పునర్విభజన గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పేసారని ముకుంద స్పష్టం చేసారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రపోర్షనల్ రేషియో పద్ధతిలో జరుగుతుందని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.
దేశంలో ఇప్పటికి సుమారు కోటిమంది స్వయంసేవకులు ఉన్నారని, వారిలో సుమారు 6లక్షల మంది అనుదినం శాఖల్లో పాల్గొంటున్నారనీ చెప్పారు. మరెన్నో లక్షల మంది ఆరెస్సెస్ స్వయంసేవకులు వ్యవసాయం, ట్రేడ్ యూనియన్ల వంటి సామాజిక సేవా రంగాల్లో వాటిలో చురుగ్గా పని చేస్తున్నారు.
‘‘చారిత్రక కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మన విస్తరణ అనుకున్నంత ఆశాజనకంగా లేదు. కానీ ఇప్పుడు భారత్ చుట్టుపక్కల దేశాల వారు కూడా మనతో చేరుతున్నారు. తమిళనాడు, బిహార్, ఒడిషాలోని కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటె ఇప్పుడు బాగా బలపడ్డాం, ఎక్కకువ ప్రదేశాలకు విస్తరిస్తున్నాం. ఒక్క తమిళనాడులోనే 4వేలకు పైగా శాఖలు నడుస్తున్నాయి’’ అని చెప్పారు.
త్రిభాషా సూత్రం గురించిన ప్రశ్నలకు జవాబిస్తూ ‘‘నిత్యజీవితంలో మాతృభాషనే వాడాలని సంఘ్ బలంగా నమ్ముతుంది. ఆ మేరకు గతంలో తీర్మానాలు కూడా చేసింది. ప్రతీ వ్యక్తీ కనీసం మూడు భాషలు నేర్చుకోవాలి. మొదటిది మాతృభాష, రెండవది ప్రాంతీయ భాష, మూడవది కెరీర్‌కు సంబంధించిన భాష. ఆ మూడవ భాషను ఎంచుకునే అవకాశం విద్యార్ధికి వదిలేయాలి అన్నదే సంఘ్ విధానం అని చెప్పారు.