క్రికెట్ అభిమానుల కోసం మరో పండుగ వచ్చింది. నేటి నుంచి 18వ విడత ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 జరగనుంది. రెండునెలల పాటు ఈ క్రికెట్ క్రీడా సంబరం అభిమానులకు ఆహ్లాదం పంచనుంది. ధనాధన్ బ్యాటింగ్, వీరోచిత స్ట్రోక్స్, అబ్బుర పరిచే ఫీల్డింగ్, దిగ్గజ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించే బౌలర్ల మెళకువలకు కేరాఫ్ ఎడ్రస్‌గా నిలిచే ఐపీఎల్ సీజన్ నేటి సాయంత్రం ప్రారంభం కానుంది. సరికొత్త నిబంధనలు, కొత్త ఆటగాళ్ళతో ఈ టోర్నీ సాగనుంది.
టోర్నీ లో భాగంగా తొలి మ్యాచ్, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు 2008లో మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడే మొదటసారి పోటీపడుతున్నాయి.
రెండో మ్యాచ్ లో భాగంగా ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ లో మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు పరుగుల పోరు ప్రారంభం కానుంది.
పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. 69 లీగ్ మ్యాచ్‌ల తర్వాత 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాలు ఉంటాయి. ఇందులో 12 డబుల్ హెడర్లు ఉండటం ప్రత్యేకం. మే 25న ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది.
గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ ప్రదర్శనను బట్టి 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా… గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున మొత్తం 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, , మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. ఇందులో 7 మ్యాచ్ లు సొంత మైదానాల్లో ఆడతాయి.
అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఉంటుంది.
ఈ సీజన్‌లో నిబంధనల్లో మార్పులు చేర్పులు జరిగాయి. బంతిపై ఉమ్మి పూయడంపై నిషేధం తొలగించారు. కరోనా విజృంభణ తర్వాత బౌలర్లపై ఉమ్మి వేయడంపై నిషేధం విధించారు. రాత్రి మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు రెండో బంతికి అవకాశం ఇవ్వనున్నారు. ఇన్నింగ్స్ లో 11 ఓవర్ల తర్వాత అంపైర్ల అనుమతితో రెండో బంతి తీసుకునే వీలు కల్పించారు. మధ్యాహ్నం మ్యాచ్‌ల విషయంలో ఈ నిబంధన వర్తించదు. ఎత్తు వైడ్లు, ఆఫ్‌సైడ్ వైడ్లకు కూడా డీఆర్‌ఎస్(DRS)ను ఎంచుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.
ఐపీఎల్-2025లో మరికొన్ని విశేషాలు…
భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎప్పుడూ ఆడని రజత్ పాటిదార్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఆ జట్టును నడిపించనున్నారు. అక్షర్ పటేల్ దిల్లీ జట్టు సారధిగా వ్యవహరించనుండగా గత సీజన్లో కోల్‌కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ కు నేతృత్వం వహిస్తున్నాడు.
కోల్ కతా కెప్టెన్ గా అజింక్య
అజింక్య రహానె కోల్‌కతా కెప్టెన్ అయ్యాడు. సంజు శాంసన్ గాయపడటంతో మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. హార్దిక్ పాండ్య ఒక మ్యాచ్ సస్పెన్షన్ ను ఎదుర్కొంటుండడంతో తొలి మ్యాచ్‌లో ముంబయికి సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
లఖ్నో సారథిగా రిషభ్ పంత్…
రిషభ్ పంత్ ఈసారి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ను ముందుండి నడిపించనున్నాడు. లఖ్‌నవూ అతడిని వేలంలో రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
టాప్ స్కోర్…287…
ఇప్పటి వరకు జరిగిన 17 సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే వేగంగా ఈ టోర్నీకోసం స్టేడియం సీట్లు నిండిపోతుంటాయి. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 287 పరుగులుగా ఉంది. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్ ఈ స్కోరు నమోదు చేసి రికార్డ్ సృష్టించింది.
ఐపీఎల్ లో అరుదైన ఘనతలు..
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. టోర్నీలో 357 సిక్స్‌లు కొట్టి, బ్యాటర్ల జాబితాలో అతడు అగ్రస్థానంలో ఉండగా 280 సిక్సులు కొట్టిన రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు (175*) కూడా గేల్ పేరిట ఉంది.
ఐపీఎల్‌లో కోహ్లి 8004 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో ఉండగా, ధావన్ ..6769 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ అందుకుని ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఈ బౌలర్ 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. మొదటి సీజన్ టైటిల్ కూడా రాజస్థాన్ రాయల్స్‌కే దక్కింది. ఐపీఎల్ తొలి సీజన్‌లో మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడారు.
గత ఐపీఎల్ 2024 లో హర్షల్ పటేల్(పంజాబ్- 14 మ్యాచ్‌లు, 24 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.