ఏపీలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. తాజాగా కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. 300 గ్రామాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మరో 2617 గ్రామాల పరిధిలో నీటిని విపరీతంగా తోడేస్తున్నారు. 300 గ్రామాల్లో తోడుకోవడానికి భూగర్భంలో చుక్క నీరు కూడా లేదని కేంద్ర భూగర్భ జల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భూమిలోకి 100 యూనిట్లు జలాలు ఇంకి, 70 యూనిట్లు మాత్రమే తిరిగి వాడుకుంటే అది సేఫ్ జోన్‌గా పరిగణిస్తారు. ఇక 70 నుంచి 90 యూనిట్లు వాడుకుంటే సెమీ క్రిటికల్‌గా తీసుకుంటారు. 90 నుంచి 100 అత్యంత ప్రమాదకరం. 100 నుంచి 110 అత్యంత దారుణంగా పరిగణిస్తారు. ఏపీలో 300 గ్రామాల్లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకున్నాయి. భూగర్భంలో తోడటానికి చుక్క నీరు కూడా లేదని కేంద్ర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి పరిశీలన చేసే శాఖ, ప్రస్తుతం ఏటా భూగర్భ జలాల వినియోగంపై నివేదికలు తయారు చేస్తోంది.
భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న గ్రామాల్లో ఆరు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న గ్రామాలు ప్రకాశం జిల్లాలో 93, శ్రీకాకుళం 76, శ్రీసత్యసాయి 51, బాపట్ల జిల్లాలో 18, ఎన్టీఆర్ 16, అనంతపురం 13, అన్నమయ్య జిల్లాలో ఒకటి ఉన్నాయి. మరో 2700 గ్రామాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్ర భూగర్భ జల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వరు. కేవలం మంచినీటి అవసరాలకు మాత్రమే బోర్లు తవ్వు కోవడానికి అనుమతిస్తారు. అత్యంత ప్రమాదకర స్థాయిలో భూగర్భ జలాలను వాడేసిన 300 గ్రామాల్లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. అలాంటి దరఖాస్తులను అసలు పరిశ్రమల శాఖకు పంపించరు. వ్యవసాయ బోర్లు, పారిశ్రామిక బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇవ్వరు. ఎలాంటి బోర్లకు కొత్తగా విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర భూగర్భ జల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. పలు పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. వాటర్‌షెడ్ల ఏర్పాటు కూడా ఇందులో భాగంగానే ప్రారంభించారు. ఎడారి లాంటి గ్రామాలను కూడా వాటర్‌షెడ్ల నిర్మాణం ద్వారా సస్యశ్యామలంగా మార్చారు. మహారాష్ట్రలో చేపట్టిన వాటర్‌షెడ్ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. వాటి స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా వాటర్‌షెడ్లు నిర్మించి భూగర్భ జలాలను పెంచే కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం నూరు శాతం రాయితీతో పంట కుంటల తవ్వకాలు చేపట్టింది. ఒక్కో కుంటకు లక్షా 50 వేలు ఖర్చు అవుతుంది. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు వారి పొలంలో వర్షపు నీరు ఇంకేలా కుంటలు తవ్వించుకోవాలి. వర్షం కురవగానే కుంటలోకి నీరు చేరాలా ఇంజనీర్లు సేవలు అందిస్తారు. కనీసం మూడు ఎకరాల రైతుకు పంట కుంట పథకం వర్తిస్తుంది. దీని ద్వారా భూగర్భ జలాలను పెంచడంతోపాటు సాగునీటి అవసరాలు 80 శాతం వరకూ తీరతాయి. పశువులకు తాగునీరు, వ్యవసాయ కూలీల నీటి అవసరాలు తీర్చడంతోపాటు డ్రిప్, స్ప్రింకర్ల ద్వారా ఉద్యాన పంటలు సాగు చేయవచ్చు.
ఎండిపోయిన బోరు బావులను గుర్తించి వర్షపు నీరువాటిల్లో ఇంకేలా ప్రైవేటు, స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నాయి. అనంతపురంలోని స్వీడన్‌కు చెందిన స్వచ్ఛంధ సంస్థ డీఆర్టీ వేలాది ఇంకుడుకుంటలు, వాటర్‌షెడ్లు నిర్మించి భూగర్భ జలాలు పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎండిపోయిన బోర్లలో వర్షపు నీరు ఇంకేలా వాటి చుట్టూ తవ్వకాలు చేసి నీరు నిలువ చేస్తున్నారు. వర్షం ద్వారా లభించిన ప్రతి నీటిబొట్టును భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే పథకాలు వేగం పుంజుకున్నాయి.
భూగర్భ జలాలను కాపాడుకోవడంలో మహారాష్ట్రకు చెందిన అన్నాహజారే చేసిన ప్రయోగాలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రాజస్థాన్ వాటర్ మాన్ రాజేంద్రసింగ్ చేసిన ప్రయోగాల ఫలితాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఎండిపోయిన నదికి జీవం పోసిన రాజేంద్రసింగ్ విధానాలు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వర్షాకాలంలో లభించిన ప్రతి నీటి బొట్టుకు ఒడిసి పట్టేందుకు చేపట్టాల్సి నిర్మాణాలపై అనేక పరిశోధనలు చేసిన రాజేంద్రసింగ్ పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎండిపోయిన నదులకు జీవం పోస్తున్నారు.
పంట కుంటలు, వాటర్‌షెడ్లు, ఇంకుడు కుంటల నిర్మాణం, ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడంలాంటి చర్యల ద్వారా జలవనరులను కాపాడుకోవచ్చు. ఇటీవల కేంద్ర, రాష్ట్రాలు అటవీ ప్రాంతంలో తవ్వుతోన్న ట్రెంచ్‌ల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. అడవిలో పడే వర్షం నదుల నుంచి సముద్రంలో కలవకుండా భారీ కుంటలు, చెరువులు తవ్వుతున్నారు. వేసవిలో అటవీ జంతువులకు తాగునీరు అందించడమే కాకుండా, భూగర్భ జలాలను కూడా కుంటల నిర్మాణం ద్వారా పెంచుతున్నారు.
భూగర్భ జలాలు పెంచడానికి ఐక్యరాజ్యసమితి సాయం అందిస్తోంది. సాంకేతిక, ఆర్థిక సాయం ద్వారా ఐరాస పలు దేశాల్లో నీటి సమస్యలను పరిష్కరిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ భూగర్భ జలాలను పెంచే కార్యక్రమాలు చేపట్టేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ఇంటిపై కురిసే వర్షపు నీరు ఇంకేలా నిర్మాణం చేపడితేనే అనుమతులు మంజూరు చేస్తున్నారు.