అటవీ ప్రదేశాల్లో నివసించే గిరిజనులను, అంటే షెడ్యూల్డు తెగల వారిని రకరకాలుగా ప్రలోభపెట్టో, బెదిరించో క్రైస్తవంలోకి మతమార్పిడి చేస్తున్న అంశం ఛత్తీస్‌గఢ్ శాసనసభలో తాజాగా చర్చకు వచ్చింది. మత మార్పిడులు చేయడానికి విదేశాల నుంచి వస్తున్న ఫండింగ్ గురించి సవిస్తరంగా చర్చించారు. బస్తర్ జిల్లాలో 70శాతం గ్రామాల్లో మతమార్పిడులు జోరుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కేశకాల్ నీలకంఠ టేకామ్ చెప్పారు. వాటన్నిటికీ నేరుగా విదేశీ నిధులే ప్రధాన వనరుగా ఉన్నాయని వివరించారు.
ఒక్క బస్తర్ జిల్లాలోనే కాదు, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలోని గిరిజనుల మతమార్పిడుల గురించి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు జవాబుగా… ఆ రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీలు నడుపుతున్న 364 సంస్థలు ఉన్నాయని, దర్యాప్తు తర్వాత వాటిలో 84 సంస్థలకు వస్తున్న ఫండింగ్ నిలిపివేయబడిందని, 127 సంస్థల లైసెన్సులు రద్దు చేయబడ్డాయనీ చెప్పారు. అసలు ప్రశ్న ఏంటంటే… మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైన పకడ్బందీ చట్టాలు ఉన్నప్పటికీ ఈ మార్పిడులు ఎందుకు ఆగడం లేదు? ఆ నేరం ఎవరిది?
ఛత్తీస్‌గఢ్ కావచ్చు, దేశంలోని మరే ఇతర రాష్ట్రం కావచ్చు.. మతమార్పిడి అనేది చాలా పెద్ద సమస్య. పార్లమెంటు లేదా అసెంబ్లీలో దానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తారు. సామాన్య ప్రజల్లో కూడా దానిగురించి ఆవేదన ఉంది. మతమార్పిడులను ఆపాలన్న డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. అంతేకాదు, వాటికోసం కఠినమైన చట్టాలు చేయాలనీ కోరుతున్నారు. నిజానికి రాష్ట్రాల్లో కూడా మతమార్పిడులను నిలువరించడానికి చట్టాలు ఉంటాయి. అయినా కూడా మత మార్పిడులు ఆగడం లేదు. అంటే, చట్టాలు చేసినంత మాత్రాన ఈ మత మార్పిడులను ఆపడం సాధ్యం కాదని అర్ధం చేసుకోవాలి.
చట్టంలో బలవంతంగా జరిగే మత మార్పిడులను అడ్డుకోవాలి అనే మాట అయితే ఉంది. కానీ ఒక వ్యక్తి తన ఇష్టంతో మతం మారవచ్చు అని కూడా ఉంది. మత మార్పిడులు చేసే వ్యక్తులు, సంస్థలు ఆ మాటనే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మత మార్పిడి చేసిన వ్యక్తులకు ఎలా బ్రెయిన్‌వాష్ చేస్తారంటే వారెప్పుడూ తమను బలవంతంగా మతం మార్చారన్న సంగతి చెప్పలేరు.
క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులు చేసే విధానం పకడ్బందీగా ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత, నిస్సహాయతలతో బాధపడే జనాలు ఉండే ప్రదేశాలను మిషనరీలు ఎంచుకుంటారు. తాము ఎక్కడ ప్రజలను మతం మార్చాలనుకుంటున్నారో అక్కడ ముందు ఒక ఆస్పత్రి, ప్రాథమిక పాఠశాల తెరుస్తారు. అక్కడ ఏ రుసుమూ లేకుండా వైద్యం అందిస్తారు, ఉచితంగా చదువు చెబుతారు. అక్కడ ఆ మతగురువులను తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు రోజూ ప్రార్థనలు చేస్తారు. క్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకుని చర్చి ఏర్పాటు చేస్తారు. ఇంక అక్కడినుంచీ మత ప్రచారం ప్రారంభమవుతుంది.
దేశంలో మత ప్రచారం చేసుకోవడం మీద ఎలాంటి ఆంక్షలూ లేవు. డబ్బులు లేకుండా వైద్యం అందిస్తూ, ఉచితంగా చదువు చెబుతూ, అవసరాలకు చేతికి డబ్బులు ఇస్తూ వాటికి అలవాటు పడిపోయేలా చేస్తారు. కొన్నాళ్ళకు ఈ సౌకర్యాలన్నీ ముందుముందు కూడా కావాలంటే మతం మారాలి అని చెబుతారు. సౌకర్యాలకు అలవాటు పడిన ప్రాణాలకు మతం మారడం పెద్ద విషయంగా అనిపించదు. అలా మతం మారిన వారు, తమను బలవంతంగా మతం మార్చారు అని చెప్పలేరు కదా.
నిజానికి పేద ప్రజలు, గిరిజనులకు సేవలు చేయడం, సౌకర్యాలు అందించడం వంటి మిషనరీలు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి అసలు ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో మంచి ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే, మంచిమంచి బడులు కడితే, గిరిజన ప్రజలు వైద్యం కోసం మిషనరీల ఆస్పత్రులకు ఎందుకు వెడతారు? విద్య కోసం మిషనరీ బడులకు ఎందుకు వెడతారు? కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. దాన్నే క్రైస్తవ మిషనరీలు వాటంగా వాడుకున్నారు. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజన జనాభాలో చాలామంది క్రైస్తవంలోకి మతం మారిపోడానికి ప్రధాన కారణం ఇదే.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రైస్తవ మిషనరీల విధానం, మోడెస్ ఆపరాండీ, ఇలాగే ఉంటుందని గ్రహించవచ్చు. ముందు ఓ చిన్న బడితో, ఓ చిన్న ఆస్పత్రితో, ఓ చిన్న చర్చితో మొదలుపెడతారు. అవి కేంద్రాలుగా ప్రజలకు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభపెడతారు. ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రధానంగా ఎస్సీలను ఆకట్టుకున్నారు. మిగతా కులాల వారు మతం మారలేదని కాదు. కానీ ఎస్సీల్లోని కొన్ని ప్రధాన కులాలవారు దాదాపు అందరూ క్రైస్తవంలోకి మతం మారిన వారే. కోస్తా తీర ప్రాంతం అంతా విద్య, వైద్యం అనే ముసుగులో ప్రవేశించి, క్రైస్తవంలోకి మతం మార్చే ప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది.
అందుకే మతమార్పిడులు జరుగుతున్నాయంటే అందులో ప్రభుత్వాల దోషం కూడా ఉంది. పేదవాడు ఎక్కడికి వెడతాడు? తనకు సౌకర్యాలు లభించే చోటికే వెడతాడు. సమాజంలోని అసమానతలు కూడా మత మార్పిడులకు కారణమనే చెప్పవచ్చు. హిందూ సమాజంలో భిన్న కులాల మధ్య ఉన్న తేడాలను వైషమ్యాలుగా, విభేదాలుగా చూపించి, వారి మధ్య అసమానతలు ఉన్నాయనే ఆలోచనలు కల్పించి, హిందూ మతం నుంచి బైటకు వెళ్ళిపోతేనే తమకు సుఖాలు, సౌకర్యాలూ లభిస్తాయి అనే విధంగా నమ్మిస్తారు. ఫలితం, ఎన్ని కఠిన చట్టాలున్నా మత మార్పిడులు ఆగవు. రోజురోజుకూ రికార్డుల్లో హిందువులుగా ఉంటూ మతం మారేవారు పెరిగిపోతూనే ఉంటారు.