ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కొద్దిరోజుల క్రితం లెక్కలు తేలని డబ్బులు భారీ మొత్తంలో లభించడాన్ని సుప్రీంకోర్టు కొలీజియం తీవ్రంగా పరిగణించింది. యశ్వంత్ వర్మను మళ్ళీ వెనక్కి అలహాబాద్‌కు (ప్రయాగరాజ్) బదిలీ చేసింది.
గతవారం హోలీ సంబరాల సమయంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు వెల్లడైంది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో జడ్జి యశ్వంత్ వర్మ ఢిల్లీలో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అత్యవసర సేవకులను పిలిపించారు, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఈ డబ్బుల వ్యవహారం వెలుగు చూసింది.
జడ్జి నివాసంలో లెక్క తెలీని డబ్బులు దొరికిన విషయం బైటపడడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం సమావేశమైంది. జస్టిస్ యశ్వంత్ వర్మను వెనక్కి అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆ వ్యవహారం మీద జస్టిస్ వర్మ ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు. ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆయన సెలవులో వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు సీజేఐతో పాటు మొత్తం ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ వర్మను బదిలీ చేయాలని ఏకగ్రీవంగా అంగీకరించినట్లు సమాచారం. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు దెబ్బ తగలకుండా కాపాడుకోవాలంటే జస్టిస్ వర్మ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు డిమాండ్ చేసారు. లేనిపక్షంలో ప్రజలకు న్యాయం అందజేయడంలో న్యాయవ్యవస్థ సమర్ధత మీద తీవ్రమైన విమర్శలు, ఇతర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు. జస్టిస్ వర్మతో స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని సమాచారం.
దానికి జస్టిస్ వర్మ తిరస్కరిస్తే ఏం చేయాలన్న విషయంపైనా చర్చ జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా అంతర్గత విచారణ జరిపించాలని కొందరు సభ్యులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ ఈ అంశాన్ని న్యాయస్థానంలో ప్రస్తావించారు. దానికి జవాబుగా, ఈ సంఘటనతో ప్రతీ ఒక్కరూ కదిలిపోయారని, ప్రతీ ఒక్కరి నైతిక స్థైర్యమూ సడలిపోయిందని చెప్పుకొచ్చారు.