రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశాలు అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో నేటినుంచీ ప్రారంభమయ్యాయి. భారతమాతకు పుష్పాంజలి ఘటించి సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ బైఠక్‌లో సుమారు 1450 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో ఏర్పడిన సంస్థల బాధ్యులు అందరూ ఈ మూడు రోజుల సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్రీయ సేవికా సమితి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్, భారతీయ జనతా పార్టీ, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థల అధ్యక్ష బాధ్యతల్లో ఉండేవారు గత యేడాది కాలంలో తమ సంస్థల ప్రగతిని, భవిష్యత్ కార్యాచరణ గురించి వివరిస్తారు.
ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ రెండు తీర్మానాలు చేయనుంది. సంస్థ శతజయంతి సందర్భంగా సంఘాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తరింపజేయడం ఒక తీర్మానం. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను ఖండిస్తూ మరొక తీర్మానం చేయనున్నారు.