అమెరికా ప్రభుత్వ వ్యయం తగ్గించే చర్యల్లో భాగంగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. మొదట్లో విద్యాశాఖ ఉద్యోగాల్లో కోత విధించారు. ఇప్పుడు ఏకంగా విద్యాశాఖనే మూసివేసారు. ఆ మేరకు ఉత్తర్వులపై దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసారు.
అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్ధులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యాశాఖను మూసివేసే ఉత్తర్వుల మీద సంతకం చేసారు. ఆ నిర్ణయాన్ని వీలైనంత త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. విద్యాశాఖ నిర్వహణ వల్ల ప్రభుత్వానికి కొత్తగా వచ్చే మేలేమీ లేదని ట్రంప్ అన్నారు. ఆ శాఖకున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చివేయాలని నిర్ణయించామని చెప్పారు. విద్యార్ధుల ఫీజు రాయితీల వంటి కొన్ని పథకాలను మాత్రం ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేసారు.
విద్యాశాఖ అధికారాలను రాష్ట్రాలకు అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆ శాఖ మంత్రి లిండా మెక్‌మేహన్ చెప్పారు. సేవల్లో ఎక్కడా అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ‘‘ట్రంప్ నాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖను మూసేయడానికి మేము కాంగ్రెస్‌తో కలిసి పని చేయవలసి ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. ప్రస్తుతానికి మేము విద్యాశాఖను వెంటనే మూసివేయడం లేదు. కేవలం అవసరం కంటె ఎక్కువ ఉన్న ఉద్యోగులపై కత్తెర వేస్తున్నామంతే. విద్యాశాఖను పూర్తిగా తొలగించి, క్రమంగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తాం’’ అని లిండా వివరంగా చెప్పుకొచ్చారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి అమెరికా ప్రభుత్వ విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది పదవీ విరమణ చేయడానికి స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మిగతా వారిని కూడా విడతల వారీగా విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పిస్తారు. పదవీ కాలం ఇంకా ఉన్నవారిని ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో వారు పూర్తిగా పదవీ విరమణ చేయవలసి ఉంటుంది.
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు తప్పుపట్టారు. ఇది ట్రంప్ తీసుకున్న విధ్వంసకరమైన, వినాశనకరమైన నిర్ణయాల్లో ఇది ప్రధానమైనది అంటూ డెమొక్రాట్లు మండిపడ్డారు.