తెలంగాణలో నేటినుంచీ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకూ కొనసాగుతాయి. ఉదయం 9.30 నుంచి మూడు గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. అయితే పరీక్షా కేంద్రానికి రావడం ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాయనివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మొత్తం 5,09,403 మంది విద్యార్ధులు పరీక్ష రాస్తున్నారు. వారిలో 2,58,895 మంది బాలురు ఉన్నారు. బాలికలు 2,50,508మంది ఉన్నారు. వారు 2,650 కేంద్రాల్లో పరీక్షలు రాస్తారు. వారిని పరిశీలించేందుకు 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650మంది చీఫ్ ఇన్విజిలేటర్లు, 2650 మంది శాఖాధికారులను నియమించారు.
విద్యార్ధులు ఏ అవాంతరాలూ లేకుండా పరీక్షలు రాయడానికి వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు. 24గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచారు. ఈ యేడాది నుంచీ మొదటిసారి 24 పేజీల ప్రత్యేకమైన బుక్‌లెట్‌ను ఆన్సర్‌షీట్‌గా ఇస్తున్నారు. ఇంక విడిగా అదనపు పేజీలు ఇవ్వబోమని స్పష్టం చేసారు.