భగవంతుడి మీద భక్తితో దేవాలయాలకు వెళ్ళే భక్తులు అక్కడ స్వామివారి సేవల కోసం విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలు గుడి నిర్వాహకులకే చేరుతున్నాయా? ఆశించిన ప్రయోజనం కోసమే వినియోగం అవుతున్నాయా? అన్న సందేహాలు సాధారణంగా రావు. కానీ ప్రస్తుతం కాణిపాకంలో అదే అనుమానం తలెత్తింది. అక్కడ స్వామివారి కోసం విరాళాలు ఫోన్‌పే చేసే నెంబర్లు అన్నీ ప్రైవేటు వ్యక్తులవి అని తేలింది. దాంతో భక్తులకు, తాము ఇచ్చిన విరాళాలు పక్కదారి పడుతున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవాలయానికి గురువారం ఒక వ్యక్తి వెళ్ళారు. దర్శనం అయాక బైటకు వచ్చి అక్కడ విరాళాల కేంద్రం దగ్గర కొంత విరాళం ఇద్దామని భావించారు. దేవస్థానం వారు ఫోన్‌పే ద్వారా విరాళాలు చెల్లించే అవకాశం ఉందంటూ అక్కడ ఫ్లెక్సీ పెట్టారు. దాంతో ఆ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆ భక్తుడు భావించారు. అన్నదానం కోసం కొంత మొత్తం కట్టేందుకు, దానికి నిర్దేశించిన ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఫోన్‌పేలో ఆ నెంబర్ వినియోగదారుడి పేరుగా ఒక వ్యక్తి పేరు వచ్చింది.
దాంతో భక్తుడికి అనుమానం వచ్చింది. పేమెంట్ ఆపేసి విషయాన్ని దేవస్థానం సిబ్బంది దృష్టికి తీసుకువెళ్ళారు. అన్నదానానికి విరాళం ఇవ్వడానికి కేటాయించిన నెంబర్లో పేరు ‘స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం అన్నకేంద్రం’ అని రావాలని వారు తెలియజేసారు. అలా కాకుండా వేరే పేర్లుంటే అవి దేవస్థానం నెంబర్లు కావని స్పష్టం చేసారు. మిగతా రెండు ఫోన్‌పే ఫోన్నెంబర్లను కూడా తనిఖీ చేయగా అవి కూడా ఆలయానికి చెందినవి కాదని తేలింది. అసలు దేవస్థానం విరాళకేంద్రం దగ్గర పెట్టిన ఫ్లెక్సీలో వేరేవారి ఫోన్ నెంబర్లు ఎలా వచ్చాయని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దేవాలయం అధికారిక ఫోన్‌నెంబర్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
దేవస్థానం అధికారులు శనివారంలోగా పాత నెంబర్లు తొలగించి, కొత్త ఫోన్‌పే నెంబర్లు కేటాయిస్తామని భక్తులకు వివరణ ఇచ్చారు. అయితే అసలు ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. అసలు ఆ నెంబర్లు ఎవరివి? భక్తులు ఫోన్‌పే ద్వారా పంపించిన విరాళాలు ఎంతకాలం నుంచి పక్కదోవ పడుతున్నాయి? దేవస్థానం సొమ్మును దొంగిలించిన వారిపై కేసులు పెడతారా? వారికి శిక్ష పడేలా చేస్తారా? ఈ ప్రశ్నలకు మాత్రం జవాబులు లేవు.