ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఓ లీప్ స్కూల్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఏపీ లీప్‌గా నామకరణం చేసిన ఈ విధానం వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ఐదు దశల్లో విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయనున్నారు. ఏపీ విద్యామంత్రి నారా లోకేశ్ హామీ మేరకు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానాన్ని రూపొందించారు. వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గంలో ఓ పాఠశాలను ఎంపిక చేసి అమలు చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ లీప్ పాఠశాలను నిర్ణయిస్తారు. ఆయా పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులతోపాటు, దాతల సాయం తీసుకుంటారు.
లీప్ విధానంలో పౌండేషన్ కోర్సు నుంచి నాలుగు దశల్లో బడి విద్య పూర్తికి చర్యలు తీసుకుంటారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌండేషన్ పూర్తి చేసి ఒకటో తరగతిలో ప్రవేశానికి మార్గం సుగమం చేస్తారు. ప్రాథమిక విద్య, సెకండరీ విద్యను బలోపేతం చేస్తారు. బడి మానేసిన వారిలో 95 శాతం మంది మరలా బడిలో చేరే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, విద్యాప్రమాణాల మెరుగు పరచడంపై దృష్టి సారిస్తారు. ఇందుకు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
లీప్ ప్రాగ్రామ్‌లో ఐదు అంశాలకు ప్రాధాన్యం
ప్రతి విద్యార్థికి సమాన, సమ్మిళత విద్య అందించాలనేది ప్రధాన లక్ష్యం. స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంపొందించడం లింగ, సామాజిక సమానత్వం సాధించడం లక్ష్యంగా పనిచేయడంతోపాటు, దివ్యాంగులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వారి సంపూర్ణ అభివృద్ధికి నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తారు. ఉద్యోగాలు లభించేలా పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేస్తారు. పరిశోధనకు పెద్దపీట వేస్తారు. సృజనాత్మక పరిశోధనలను ప్రోత్సహిస్తారు. నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేటిన్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ప్రపంచ ప్రమాణాలతో పాఠ్యప్రణాళిక అమలు చేసేందుకు వరల్డ్ క్లాస్ సంస్థల భాగస్వామ్యంతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తారు.