బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు, నటులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు విష్ణుప్రియ,రీతూచౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటలుపైగా విచారించగా, రీతూ చౌదరి గురువారం మధ్యాహ్నం 2 గంటల తరవాత విచారణకు హాజరయ్యారు. ఆమెను పోలీసులు 5 గంటలకుపైగా విచారించారు. తరవాత ఇద్దరినీ కలిపి విచారించినట్లు పోలీసులు చెప్పారు.
ముఖ్యంగా ఎన్ని బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం నిర్వహించారు. వారితో ఎప్పుడు ఒప్పందాలు జరిగాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరు మిమ్మల్ని సంప్రదించారు. అనే ప్రశ్నలు వేశారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి ఎంత వసూలు చేశారు… అనే విషయాలు కూడా రాబట్టారు. విష్ణుప్రియ, రీతూచౌదరి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తీసుకున్నారు. మరలా విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలంటూ చెప్పి పంపించారు.
బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు చేసిన కేసులో నటులు ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ సహ, నటీమణులు మంచు లక్ష్మి, ప్రణీతకు కూడా నోటీసులు జారీ చేశారు.బెట్టింగ్ యాప్ ప్రకటనలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 10 సంవత్సరాల కిందట ఓ బెట్టింగ్ యాప్ వారికి ప్రచారం చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే అది ఏడాది ఒప్పందం ఉందని, వారు 9 సంవత్సరాలుగా ఆ ప్రకటన వేస్తున్నారని చెప్పుకొచ్చారు.
కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు పరారీలో ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్‌లకు నోటీసులు ఇచ్చినా ఇంత వరకు విచారణకు హాజరు కాలేదు. న్యాయబద్దంగానే ప్రకటనలు చేశానంటూ హర్షసాయి చెప్పడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్దం అవుతున్నారు. ఇవాళ కొందరు పంజాగుట్ట పోలీసుల వద్ద హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండు రోజులు సమయం ఇచ్చి…హాజరు కాని వారికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.