ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళగా ఉద్యమాలు జరుగుతున్నాయి. వర్గీకరణం కోసం కొందరు పట్టుబడితే ఎస్సీలను విడగొట్టవద్దంటూ మరికొందరు ఉద్యమాలు చేపట్టారు .
తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలుగా ఎస్సీవర్గీకరణ ఉద్యమం సాగుతోంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ ఈ డిమాండ్ ఉంది. సాంఘిక, రాజకీయ అంశంగా వర్గీకరణ అంశం మారింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, సంబంధించి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వాలు వేసిన అన్ని కమిషన్లు సమర్థించాయి. ఇదే విషయాన్ని ఎస్సీ వర్గీకరణపై నివేదిక అందజేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రస్తావించింది.
పంజాబ్‌లో 1995లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు కమిటీని నియమించింది. ఆ కమిటీ సానుకూల సిఫారసులతో రూపొందించిన పాలసీని 2002లో ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. 2006లో రిజర్వేషన్లపై చేసిన చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది.
ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా హైకోర్టు ఉదహరించింది. దీనిని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. అనేక రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులన్నీ కలిపి సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ ఉద్యమ ప్రస్థానం ఇలా …
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 1994 జూన్ 7 బీజం పడింది. ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలంటూ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో మందకృష్ణమాదిక ఉద్యమం ప్రారంభించారు.
ఎస్సీ కులాల వర్గీకరణపై సిఫార్సులు చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి (జస్టిస్ పి.రామచంద్రరాజు)తో కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా 1996 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
జస్టిస్ పి.రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎస్సీలను ఏ,బీ,సీ,డీ వర్గాలుగా విభజించాలని 1997 మే 28న ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-ఎలో రెల్లిలతో పాటు మరో 11 ఉపకులాలు, బి కేటగిరిలో మాదిగలతో పాటు మరో 17 ఉపకులాలు, సి కేటగిరీలో మాలతో పాటు 24 ఉపకులాలు, డి కేటగిరీలో ఆదిఆంధ్రతో పాటు మరో 3 ఉపకులాలు ఉండేలా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో సంప్రదించకుండానే రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
1995-96లో ఎమ్మెల్యేలతో శాసనసభా కమిటీ వేయగా ఎస్సీలను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. .
ఎస్సీ వర్గీకరణ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 1998 మార్చిలో ప్రభుత్వం కోరింది. 1998 ఏప్రిల్ 22న శాసనసభా కమిటీ సిఫార్సు ఆధారంగా తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం2000 మేలో రూపు దాల్చింది. 2000 నవంబరులో హైకోర్టు ఈ చట్టాన్ని నిలిపేయడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈవీ పున్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఈ కేసు పేరొందింది.
ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు 2004 నవంబరు 5న తీర్పు చెప్పింది. పార్లమెంటు మాత్రమే రాష్ట్రపతి జాబితాలోని అంశాలపై మార్పుచేర్పులు చేయగలదని తీర్పులో స్పష్టం చేసింది.
2004 డిసెంబరు 10న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటు చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. దీంతో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వర్గీకరణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాల్సి ఉందని ఈ కమిషన్ సూచించింది.
ఉషా మెహ్రా కమిషన్ నివేదిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాదిగ, రెల్లి, ఆది ఆంధ్ర కులాలకు రిజర్వేషన్లలో సమాన వాటా ఇవ్వవచ్చని 2008 అక్టోబరు 21న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెలిపింది.
2010 డిసెంబరు 12న తన సిఫారసును సవరించుకున్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. రాష్ట్రాలు ఇలా రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీల్లేదని పేర్కొంది. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప పార్లమెంటుకు ఆ హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఉషా మెహ్రా కమిషన్ సిఫారసులు ఆమోదించలేమంది.
వివిధ రాష్ట్రాల డిమాండ్లు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు అప్పగించింది. రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణ చేయవచ్చని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పు వెల్లడించింది.
దీంతో 2025 మార్చి 10న ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వర్గీకరించింది. గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వివరించింది.
ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయడంతో పాటు 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయవచ్చు అని సూచించింది. ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. చేయడంతో పాటు రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలని పేర్కొంది.
రాష్ట్రం యూనిట్‌గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్‌గా అమలు చేస్తామని స్పష్టం చేశారు.