తండ్రి మందలించాడని ఓ కుమార్తె దారుణానికి పాల్పడింది. చెడ్డ పనులు చేయవద్దంటూ హితవు పలికిన తండ్రి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించి రక్త సంబంధాలకే మచ్చ తెచ్చే ఘాతుకానికి పాల్పడింది. వివాహేతర సంబంధం వద్దన్న తండ్రిని కుమార్తె, ప్రియుడి సాయంతో గొంతు నలిమి చంపేసింది. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పరిధిలో జరిగింది. తండ్రి మందలించాడనే కోపంతో ఓ మహిళ, తన ప్రియుడి సాయంతో కన్న తండ్రినే కిరాతకంగా అంతమొందించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేదరపేట వీధికి చెందని సూరా రాంబాబు కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలసిన తండ్రి,కుమార్తెను మందలించాడు. దీంతో రగలిపోయిన దుర్గ, తండ్రి ప్రాణాలు తీయాలని నిర్ణయంచుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథక రచన చేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరింది. అతను తనతో పాటు స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి ఇంటికి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు పై కూర్చొని గొంతు నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. ఆ తర్వాత సూరా రాంబాబు సహజంగా చనిపోయినట్ల కథ అల్లి బంధువులకు తెలియజేశారు.సూరా రాంబాబు సోదరుడైన
సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వివాహేతర సంబంధం కోసం కన్న తండ్రినే కుమార్తె హత్య చేయడంపై స్థానికులు షాక్ కు గురయ్యారు. తండ్రి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించాాలా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.