ఎస్సీ వర్గీకరణ అమలు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్ర ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణ నివేదికను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ కు మొగ్గుచూపే అవకాశముంది.
ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించడానికి ముందు జాతీయ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించాలని ఆర్టికల్ 338(9) నిబంధన లో ఉంది. అందుకు అనుగుణంగా రెండు రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ప్రభుత్వం నివేదించాల్సి ఉంది. ఆ సంస్థ అడ్వయిజరీ బాడీ మాత్రమే. అంగీకరించాల్సిన అవసరం లేదు.
ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని రాష్ట్రాలకే అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా అవసరం లేదు.
రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక…
ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలను ఉపకులాలకు సమానంగా పంచాలని రాజీవ్‌రంజన్ మిశ్ర కమిషన్ సూచించింది. వారికోసం ప్రత్యేక కార్యక్రమాల అవసరాన్ని నొక్కిచెప్పింది. ఈ కమిషన్ , ఉపకులాల ప్రతినిధులతో సమావేశమై, వారి వినతులు స్వీకరించింది.
ఉద్యోగాల భర్తీలో ఒక గ్రూప్‌నకు చెందిన అర్హత గల అభ్యర్థి అందుబాటులో లేక, ఆ పోస్టును భర్తీ చేయలేకపోతే అదే గ్రూప్ నుంచి తదుపరి ఏడాది భర్తీ చేసేందుకు తీసుకెళ్లాలి. తర్వాతి ఏడాది కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైతే ఆ పోస్టు తర్వాతి గ్రూప్‌నకు వెళ్తుంది.
వర్గీకరణకు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలనే వాదనకూడా ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున కమిషన్ ఈ విషయంలో ఎలాంటి సిఫారసులూ చేయడం లేదని నివేదకలో స్పష్టం చేసింది.
జనగణన నిర్వహించిన తర్వాత హేతుబద్ధ విధానాలు, వెనకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అని సూచించింది.
ఎస్సీ కేటగిరిలోని 59 ఉపకులాల్లో వెయ్యి కంటే తక్కువ జనాభా ఉన్న కులాలు 32 ఉన్నాయి. 15 ఉపకులాల జనాభా 100 కంటే తక్కువే. వీరికి ప్రభుత్వ పథకాల సేవలు అందడ లేదు. ప్రభుత్వం ప్రత్యేక సంస్థ, మరేదైనా ఎన్జీవోతో సర్వే చేయించి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను గుణాత్మకంగా అంచనా వేయాలని నివేదికలో పేర్కొన్నారు.
ఆదివాసీ గిరిజనులకు కేంద్రం అమలు చేస్తున్న లక్షిత పథకాల మాదిరిగా, వీరి అభ్యున్నతికి కూడా ప్రత్యేక చొరవ చూపాలి. సంబంధిత శాఖల నిపుణులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయొచ్చు అని నివేదికలో వివరించారు.
కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే రెవెన్యూ అధికారులకు ఉపకులాలపై అవగాహన కల్పించడంతో పాటు సాంఘిక సంక్షేమం, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా మార్గదర్శకాలు రూపొందించాలి అని నివేదికలో సూచించారు.
ఉపకులాల చరిత్ర, సంప్రదాయాలు, భాష, నిఘంటువులపై రూపకల్పన కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ సేవలు ఉపయోగించుకోవచ్చు.
నివేదికలోని మరికొన్ని కీలక అంశాలు…
ఎస్సీ కేటగిరిలో మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో మాలల ఆధిపత్యం కొనసాగుతోంది. 2023-24 సమాచారం ప్రకారం ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాధిపతులుగా ఎస్సీ ఉద్యోగుల్లో మాలలు 32,914 మంది ఉంటే, మాదిగలు 17,574 మందే ఉన్నారు. ఇతర ఎస్సీ కులాలకు సంబంధించి 2,442 మందే ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత గడిచిన పదేళ్లలో ఎనిమిది ఎస్సీ కులాలకు ఇంత వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా దక్కలేదు.
బేడ(బుడగ) జంగాలు గతంలో భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ జాబితాలో ఉన్నారు. తర్వాత వారు తెలంగాణకే పరిమితమయ్యారు. ఎస్సీ ఉపకులాల్లో ఒకటిగా తమను చేర్చాలని వారు కోరుతున్నారు. వీరు నోటిఫైడ్ లిస్టులోకి రానందున, వీరిని ఎస్సీ జనాభా కింద కమిషన్ పరిగణించలేదు.
ఎస్సీ ఆర్థిక సంస్థ ద్వారా సంస్థాగత మద్దతు, సామర్థ్య పెంపు కార్యక్రమాలకు నిధులు పెంచాలని, సమీకృత వ్యవసాయ, ఉద్యాన, జలవనరులు, సూక్ష్మసేద్యం, గ్రామీణాభివృద్ధి, భూమి ఆధారిత కార్యక్రమాలు అమలు చేయాలని కమిషన్ పేర్కొంది.
ఎస్సీ కుటుంబాలకు భూమి కేటాయించి వాటి అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రోత్సాహాకాలు అందజేయాలని ఆ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కమిషన్ స్పష్టం చేసింది.
సాంఘిక సంక్షేమ వసతిగృహాల నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టాలి.
లిడ్‌క్యాప్‌నకు కేటాయించిన భూములను సమర్థంగా ఉపయోగించడంతోపాటు మినీ, మీడియం లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలి.
ఎస్సీ కేటగిరీకి చెందిన చిరువ్యాపారులు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు మద్దతు కల్పించే విధానాలు రూపొందించాలని కమిషన్ తన నివేదికలో వివరించింది.
దళితులంతా సజాతీయులు కాదనేందుకు చారిత్రక ఆధారాలున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించింది.