మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 17న హిందువుల మీద ముస్లిం మూకల హింసాత్మక దాడిలో బంగ్లాదేశ్ కనెక్షన్ కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. హింసను ప్రేరేపించేలా బెదిరింపులు జారీ చేసిన సోషల్ మీడియా అకౌంట్లలో బంగ్లాదేశ్‌కు చెందిన ఖాతాలు ఉన్నాయని తెలుసుకున్నారు. నాగపూర్‌లో హిందువుల ఆందోళన గురించి తప్పుడు వార్తలు, పుకార్లు, వారిపై హింసకు ప్రేరేపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 97 ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో అత్యధికం బంగ్లాదేశ్‌కు చెందిన ఐపీ అడ్రస్‌లు ఉన్న కంప్యూటర్ల నుంచే పోస్ట్ అయ్యాయి. సోమవారం జరిగిన మతఘర్షణలు కేవలం చిన్న నమూనా మాత్రమే అనీ, భవిష్యత్తులో ఇంకా పెద్దస్థాయిలో ఘర్షణలు జరుగుతాయనీ ఒక పోస్ట్‌లో బెదిరించారు.
పుకార్లను వ్యాపింపజేసినందుకు, హింసాకాండను ప్రేరేపించినందుకూ 34 సోషల్ మీడియా అకౌంట్ల మీద సైబర్ సెల్ చర్యలు తీసుకుంది. 10 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా ఈ హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 84మందిని అరెస్ట్ చేసారు. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాగపూర్ నగర అధ్యక్షుడు ఫహీమ్ షమీమ్ ఖాన్ ఈ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి 69మంది అరెస్టులను ధ్రువీకరించారు. అరెస్టయిన వారిలో 8మంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కూడా ఉన్నారు.
19మంది నిందితులకు మార్చి 21 అంటే రేపు శుక్రవారం వరకూ పోలీస్ కస్టడీ విధించారు. కుట్రకు సూత్రధారి అయిన ఫహీమ్ షమీమ్ ఖాన్ మీద 500మందికి పైగా ముస్లిములను సమీకరించి, వారిని హింసకు పాల్పడేలా ప్రేరేపించాడన్న ఆరోపణలున్నాయి. హింసాకాండ జరిగాక గణేశ్‌పేట్ పీఎస్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా ఫహీమ్ షమీమ్ ఖాన్ పేరును చేర్చిన కొద్ది గంటల్లోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. హింసాకాండ చెలరేగడానికి కొద్దిసేపటి ముందు ఫహీమ్ జనాలను రెచ్చగొడుతూ చేసిన ప్రసంగం వీడియో కూడా వెలుగు చూసింది. అతనిమీద ఎఫ్ఐఆర్‌లో రేప్, లైంగికదాడి, దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఉన్నాయి. నాగపూర్‌లోని యశోధరానగర్ సంజయ్‌బాగ్ కాలనీ నివాసి అయిన 38ఏళ్ళ ఫహీమ్ షమీమ్ ఖాన్ ఫొటోను కూడా వెంటనే విడుదల చేసారు. అతనికి మార్చి 21 వరకూ పోలీస్ కస్టడీ విధించారు.
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్‌తో హిందూ సంస్థలు మార్చి 17 సాయంత్రం నాగపూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఆ సమయంలో కొందరు దుండగులు దురుద్దేశాలతో, ముస్లిముల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను హిందువులు తగలబెట్టారంటూ పుకార్లు వ్యాపింపజేసారు. ఆ వెంటనే హిందువుల మీద దాడి చేయాలంటూ ముస్లిములను రెచ్చగొట్టే కార్యక్రమం జరిగిపోయింది. సోషల్ మీడియాలో శరవేగంగా పుకార్లను, ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్లనూ వ్యాపింపజేసారు. దాడులు ఎలా చేయాలన్న కుట్రలు కూడా సిద్ధమైపోయాయి. ఆ మేరకే హిందువుల ఇళ్ళు, దుకాణాల మీద దాడులు చేసారు. ఆడవారిని, పిల్లలనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. హిందువుల వాహనాలను తగులబెట్టారు. ఆ దాడుల్లో 30మందికి పైగా సామాన్య ప్రజలు గాయపడ్డారు. 33మంది పోలీసులు కూడా గాయాల పాలయ్యారు.
హిందువుల మీద దాడులు ప్రణాళికాబద్ధంగా జరిగాయని నిర్ధారించడానికి ప్రత్యక్ష సాక్షుల కథనాలు సహకరించాయి. ఒక చోట నాలుగు దుకాణాలుంటే వాటిలో ముస్లిముల దుకాణాలు రెండింటిని వదిలేసి, హిందువుల దుకాణాలు రెండింటిని మాత్రం తగులబెట్టారు. పార్కింగ్ ఏరియాలో ముస్లిముల వాహనాలను ముందస్తుగా తొలగించి, హిందువుల వాహనాలు మాత్రమే ఉండేలా జాగ్రత్త తీసుకుని వాటికి నిప్పు పెట్టారు. అలాంటి చర్యల వల్లనే హిందువుల మీద ముస్లిములు ఉద్దేశపూర్వకంగా హింసాత్మక దాడులకు పాల్పడ్డారని స్పష్టమయింది.
నాగపూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ కూడా కర్ఫ్యూ కొనసాగింది. శాంతిని పునరుద్ధరించడానికి భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి.
తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్‌రెడ్డి