బస్తర్ అడవుల్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బిజాపూర్-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. ఆ ఎన్‌కౌంటర్‌లో బిజాపూర్ జిల్లా రిజర్వ్ గార్డ్ దళానికి చెందిన ఒక గార్డు అమరుడయ్యాడు.
ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ ఉదయం 7గంటలకు ఇరువర్గాల మధ్యా కాల్పులు మొదలయ్యాయి. బిజాపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మరోవైపు, కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఆ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. అయితే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
ఈ యేడాది ఈ మూడు నెలల్లోనే ఇప్పటివరకూ 90మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.