ఏపీలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు కుర్రోడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగిస్తుండగా గుంటూరుకు చెందిన చావా అభిరామ్, ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని బలంగా ఆకాంక్షించడంతో పాటు అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు. ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నాడు. మోటర్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్ చదివి అక్కడే పీజీ కూడా పూర్తి చేశాడు. జన్మభూమి కోసం ఏదైనా చేయాలనే తలంపుతో భారత్ కు తిరిగివచ్చాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ఇక్కడి నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుదని భావించి అందుకు తగిన అధ్యయనం చేశాడు. గుంటూరు శివారులోని నల్లచెరువులో ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను స్థాపించి ఎయిర్ ట్యాక్సీని తయారు చేయడంలో విజయం సాధించాడు.
పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా ఎయిర్ ట్యాక్సీని రూపొందించాడు. అయితే ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలకు డీజీసీఏ అనుమతి లభించదు. దీంతో పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. పూర్తిగా దేశీయ ఉపకరణాలతోనే వీటిని రూపొందించడం విశేషం. రెండు సీట్లతో కూడిన ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టారు. రెండు సీట్ల వాహనం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మూడు సీట్లతో కూడిన ఎక్స్-4 మోడల్‌ను మరో నెలరోజుల్లో పరిశీలించనున్నారు.
వీ2 రకం గరిష్ఠంగా 40 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. 1,000 అడుగుల ఎత్తులో 100 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణిస్తుంది. ఎక్స్-4 ఎయిర్ ట్యాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వీ2 మోడల్ ధర రూ.2 కోట్లు, ఎక్స్-4 రకం రూ.8 కోట్లు ఉంటుందని అభిరామ్ తెలిపారు.
తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్‌రెడ్డి